LOADING...
Piaggio: రూ.2.49 లక్షలకు పియాజియో Ape WavE.. ఒక్క ఛార్జ్‌తో 90 కి.మీ. ప్రయాణం
రూ.2.49 లక్షలకు పియాజియో Ape WavE.. ఒక్క ఛార్జ్‌తో 90 కి.మీ. ప్రయాణం

Piaggio: రూ.2.49 లక్షలకు పియాజియో Ape WavE.. ఒక్క ఛార్జ్‌తో 90 కి.మీ. ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త Ape WavE ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎల్3 ప్యాసింజర్ ఈవీ విభాగంలో ప్రవేశపెట్టిన ఈ వాహనం ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా నిర్ణయించింది. కొత్త Piaggio Ape WavEలో 5.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. నగరాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 3 కిలోవాట్ల శక్తితో పాటు 25 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

వివరాలు 

ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కు 19శాతం గ్రేడ్‌బిలిటీ

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే వాస్తవ పరిస్థితుల్లో సుమారు 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీని సుమారు 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కు 19శాతం గ్రేడ్‌బిలిటీ ఉండటంతో ఎత్తైన రహదారులు,వివిధ రకాల రోడ్లపై కూడా సులభంగా నడుస్తుంది. పూర్తి మెటల్ బాడీ, మోనోకోక్ నిర్మాణంతో రూపొందించిన ఈ వాహనం వాణిజ్య వినియోగానికి అనువుగా ఉండేలా బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు. దీంతో ప్రయాణ సమయంలో శబ్దం,కంపనాలు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. Ape WavEలో 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రహదారులపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు.

వివరాలు 

ఫ్లీట్ ఆపరేటర్లు, వ్యక్తిగత యజమానులకు ఇది ప్రయోజనకరం

విశాలమైన క్యాబిన్‌ను ఏర్పాటు చేయడంతో రోజువారీ ప్రయాణాల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది. తక్కువ కొనుగోలు వ్యయం, నిర్వహణ ఖర్చులతో పాటు వాహన వినియోగాన్ని పెంచి ఆదాయాన్ని మెరుగుపరచేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఫ్లీట్ ఆపరేటర్లు, వ్యక్తిగత యజమానులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. ఎల్3 ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కు అవసరమైన సౌలభ్యాలను అందిస్తూనే, ఎల్5 వాహనాల్లో లభించే ప్రయాణ సౌకర్యం, డ్రైవింగ్ నమ్మకాన్ని కూడా అందించేలా Ape WavEను అభివృద్ధి చేసినట్లు పియాజియో వెల్లడించింది. ముఖ్యంగా షేర్డ్ మొబిలిటీ సేవలు, నిర్దిష్ట మార్గాల్లో నడిచే రవాణా సేవలు, తక్కువ దూర ప్రయాణికుల రవాణాను లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాన్ని రూపొందించింది.

Advertisement

వివరాలు 

డ్రైవర్లకు తక్కువ పెట్టుబడితో పాటు మెరుగైన సౌకర్యం

ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫీ మాట్లాడుతూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా ప్యాసింజర్ త్రీ వీలర్ విభాగంలో నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. డ్రైవర్లకు తక్కువ పెట్టుబడితో పాటు మెరుగైన సౌకర్యం, భద్రత, విశ్వసనీయ పనితీరును అందించాలనే లక్ష్యంతో Ape WavEను ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని చెప్పారు.

Advertisement