Renault Duster Hybrid: రెనో డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం.. ధర, మైలేజీ, ఫీచర్ల వివరాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
రెనో ఇండియా తన కొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ E-Tech 160 మోడల్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఎస్‌యూవీ లీటరు పెట్రోల్‌కు 29 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ARAI ధ్రువీకరించింది. దీంతో ఈ విభాగంలో అత్యధిక మైలేజీ ఇచ్చే ఎస్‌యూవీల్లో ఒకటిగా డస్టర్ హైబ్రిడ్ నిలిచింది. ఈ కారుకు 2026 అక్టోబర్ 9 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు రెనో ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్ మోడళ్లతో పాటు హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా కంపెనీ విక్రయించనుంది.
వివరాలు
రెనో డస్టర్ హైబ్రిడ్ మైలేజీ.. ప్రత్యర్థులతో పోలిక
మెరుగైన మైలేజీతో పాటు పనితీరును కోరుకునే వినియోగదారులకు ఇది మరో ఎంపికగా నిలవనుంది.
రెనో డస్టర్ హైబ్రిడ్ లీటరుకు 29కి.మీ. మైలేజీ ఇస్తుండగా,టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడళ్లు 27.97కి.మీ. మైలేజీని అందిస్తున్నాయి.
ఈ లెక్కన డస్టర్ హైబ్రిడ్ లీటరుకు 1.03కి.మీ. ఎక్కువ మైలేజీ ఇస్తుంది.
అంటే కాగితంపై చూస్తే దాదాపు 3.7శాతం మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అయితే వాస్తవ పరిస్థితుల్లో వచ్చే మైలేజీ ట్రాఫిక్,డ్రైవింగ్ విధానం,రహదారుల పరిస్థితులను బట్టి మారుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డస్టర్ పెట్రోల్ మోడళ్లతో పోల్చినా హైబ్రిడ్ వెర్షన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించనుంది.
వివరాలు
రెనో డస్టర్ హైబ్రిడ్ ఇంజిన్, పనితీరు ఎలా ఉంటాయంటే?
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మోడల్ లీటరుకు 19.4కి.మీ. మైలేజీ ఇస్తుండగా,1.3లీటర్ పెట్రోల్ వెర్షన్ 17.7 కి.మీ. మైలేజీని అందిస్తోంది.
డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ E-Tech 160లో 1.8లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh బ్యాటరీని అందించారు.
ఈ మూడు వ్యవస్థలు కలిసి 160హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
డ్రైవింగ్ పరిస్థితులను బట్టి పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ల పనితీరును సమన్వయం చేసేందుకు ఇంటెలిజెంట్ మల్టీ-మోడ్ ట్రాన్స్‌మిషన్ పనిచేస్తుంది.
అవసరమైనప్పుడు ఈ కారు ఎలక్ట్రిక్ పవర్‌తోనే ప్రయాణించగలదు.
బ్రేకులు వేసినప్పుడు, వేగాన్ని తగ్గించినప్పుడు ఉత్పత్తయ్యే శక్తిని తిరిగి బ్యాటరీలో నిల్వ చేస్తుంది.
డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ మోటార్లు, పెట్రోల్ ఇంజిన్ మధ్య మార్పు సాఫీగా జరుగుతుంది.
వివరాలు
రెనో డస్టర్ హైబ్రిడ్ ధర ఎంత ఉండొచ్చు?
కారు సాధారణంగా నడుస్తున్నప్పుడే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అందువల్ల ప్రత్యేకంగా బయటి ఛార్జర్‌కు అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు.
మెరుగైన మైలేజీతో పాటు మంచి పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్ వ్యవస్థను రూపొందించినట్లు రెనో తెలిపింది.
ప్రస్తుతం రెనో డస్టర్ పెట్రోల్ మోడళ్ల ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.69 లక్షల వరకు ఉన్నాయి.
అయితే కొత్త హైబ్రిడ్ వెర్షన్ ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
అక్టోబర్ 17న జరగనున్న అధికారిక విడుదల కార్యక్రమంలో ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే హైబ్రిడ్ వెర్షన్‌ను ఏ ధరల శ్రేణిలో అందుబాటులోకి తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
రెనో డస్టర్ హైబ్రిడ్ ధర ఎంత ఉండొచ్చు?
రెనో ఇండియా భవిష్యత్తు ఎలక్ట్రిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా డస్టర్ హైబ్రిడ్ కీలక పాత్ర పోషించనుంది.
కంపెనీ ప్రకటించిన 'futuREady' ప్రణాళికలో భాగంగా భారత్‌లో విడుదలవుతున్న తొలి E-Tech మోడల్‌గా ఇది నిలవనుంది.
గతంలో డస్టర్‌కు డీజిల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉండేది.
ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా మెరుగైన మైలేజీతో పాటు పనితీరును కోరుకునే వినియోగదారులకు రెనో కొత్త ప్రత్యామ్నాయాన్ని అందించనుంది.