Hero Bikes Price Hike: సామాన్యులకు షాక్.. హీరో మోటోకార్ప్ బైక్స్ ధరల పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
సామాన్య ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూ 'హీరో మోటోకార్ప్' భారత వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా కంపెనీ భారత్‌లో తన 100-125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల ధరలను స్వల్పంగా పెంచింది. ఈ ధరల పెంపు HF 100, HF డీలక్స్, ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ వంటి పాపులర్ మోడళ్లపై వర్తించనుంది. ఒక్కో బైక్‌పై గరిష్టంగా రూ.750 వరకు మాత్రమే ధర పెంపు ఉండటంతో, ఈ మార్పు కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Details
ఉత్పత్తి వ్యయాల కారణంగానే పెంపు
ధరలు పెంచిన కారణాన్ని హీరో మోటోకార్ప్ అధికారికంగా ప్రకటించకపోయినా పెరిగిన ఉత్పత్తి వ్యయాలను భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మోడల్ వారీగా ధరల వివరాల్లోకి వెళ్తే హీరో మోటోకార్ప్ లైనప్‌లో అత్యంత చౌకైన కమ్యూటర్ బైక్‌గా గుర్తింపు పొందిన HF 100కు రూ.750 ధర పెంపు జరిగింది. తాజా ధరల ప్రకారం ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.59,489గా ఉంది. ఒక్కటే వేరియంట్ అయిన డ్రమ్-కిక్-క్యాస్ట్ ఆప్షన్‌లో లభిస్తున్న ఈ బైక్‌లో 97.2సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తూ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నగర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు.
Details
హీరో ప్యాషన్ ప్లస్‌కు మాత్రం స్వల్పంగా పెరుగుదల
ధరలు పెరిగిన మరో మోడల్‌గా హీరో HF డీలక్స్ నిలుస్తోంది. ఆల్ బ్లాక్, కిక్ క్యాస్ట్, సెల్ఫ్ క్యాస్ట్, i3S క్యాస్ట్, ప్రో అనే ఐదు వేరియంట్లపై కూడా రూ.750 వరకు ధర పెంపు జరిగింది. తాజా ధరల ప్రకారం HF డీలక్స్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.56,742 నుంచి రూ.69,235 వరకు ఉంది. అయితే ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు పొందిన హీరో ప్యాషన్ ప్లస్‌కు మాత్రం స్వల్పంగా రూ.250 మాత్రమే ధర పెంపు జరిగింది. ఈ మోడల్‌లో కూడా HF సిరీస్‌లో ఉపయోగించే అదే ఇంజిన్‌ను అందిస్తున్నారు. తాజా ధరల ప్రకారం ప్యాషన్ ప్లస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,941గా, 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.78,324గా ఉంది.