Cars24: యూజ్డ్ కార్లకు లైఫ్‌టైమ్ వారంటీ: కార్స్24 సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఉపయోగించిన కార్ల విక్రయాల్లో ముందున్న కార్స్24 (Cars24) సంస్థ తాజాగా వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్స్24 ద్వారా కొనుగోలు చేసే సర్టిఫైడ్ యూజ్డ్ కార్లకు లైఫ్‌టైమ్ వారంటీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారంటీ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, డ్రైవ్‌ట్రెయిన్ వంటి కీలక భాగాలకు వర్తిస్తుందని, వాహనం రిజిస్ట్రేషన్ తేదీ నుంచి గరిష్టంగా 12 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు పూర్తయ్యే వరకు (ఏది ముందైతే అది) అమల్లో ఉంటుందని తెలిపింది. కాలక్రమంలో తలెత్తే పెద్ద మెకానికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చామని, తాము అమ్మే కార్ల నాణ్యతపై పూర్తి నమ్మకమే ఇలాంటి వారంటీ ఇవ్వడానికి కారణమని కార్స్24 ఇండియా సీఈఓ హిమాన్షు రత్నూ చెప్పారు.
వివరాలు
రాబోయే 6-12 నెలల్లో ఐపీవోకు వెళ్లాలని కార్స్24 యోచన
ఈ లైఫ్‌టైమ్ వారంటీ కార్స్24 సర్టిఫైడ్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉండగా,దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ సర్టిఫైడ్ వర్క్‌షాపుల్లో క్యాష్‌లెస్ రిపేర్లు,పూర్తిగా డిజిటల్ క్లెయిమ్స్ ప్రాసెస్,వాహనం పికప్,డ్రాప్ సౌకర్యాలు కూడా ఉంటాయని తెలిపింది. అయితే ఈ కవరేజ్ కొనసాగాలంటే కస్టమర్లు తప్పనిసరిగా అదే సర్టిఫైడ్ వర్క్‌షాపుల్లో రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా,రాబోయే 6-12 నెలల్లో ఐపీవోకు వెళ్లాలని కార్స్24 యోచిస్తున్నట్లు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధభాగంలో సంస్థ అడ్జస్టెడ్ నెట్ రెవెన్యూ ₹651 కోట్లకు చేరగా, నష్టాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. అదే కాలంలో భారత్, యూఏఈ, ఆస్ట్రేలియాల్లో కలిపి సుమారు 85 వేల కార్లు విక్రయించి, ₹3,731 కోట్ల లావాదేవీల విలువను నమోదు చేసింది.