Better Drivers: పురుషుల కంటే మహిళలే మెరుగైన డ్రైవర్లు.. షాకింగ్ రిపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రయాణించే వారు అత్యంత ప్రమాదకర సమయంలో డ్రైవింగ్ చేస్తున్నట్లేనని తాజా అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026 ప్రకారం, రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ స్కోర్లు గణనీయంగా తగ్గుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రయాణంతో పోలిస్తే రాత్రి వేళల్లో డ్రైవింగ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. మరోవైపు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య రోడ్డుపై ప్రయాణించడం అత్యంత సురక్షితమైన సమయంగా నివేదిక పేర్కొంది.
వివరాలు
17 రాష్ట్రాల్లో నమోదైన 45 లక్షల ట్రిప్‌లపై నివేదిక..
జునో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన టెలిమెట్రీ డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో నమోదైన 45 లక్షల ట్రిప్‌లు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనం ప్రకారం, రోడ్డు ప్రమాదాలకు వయస్సు లేదా లింగం వంటి జనాభా వివరాల కంటే డ్రైవింగ్ చేసే విధానమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. దేశంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా డ్రైవింగ్ ప్రవర్తనకు సంబంధించిన అంశాలే కారణమని నివేదిక వెల్లడించింది.
వివరాలు
పురుషులు-మహిళల్లో ఎవరు మెరుగైన డ్రైవర్లు?
చాలా కాలంగా ఉన్న ఒక అభిప్రాయాన్ని ఈ నివేదిక ఖండించింది. సురక్షిత డ్రైవింగ్ విషయంలో పురుషులు, మహిళల మధ్య పెద్దగా తేడా లేదని టెలిమెట్రీ డేటా స్పష్టం చేసింది. మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోర్ సాధించగా, పురుషులు 92.43 స్కోర్‌తో చాలా స్వల్ప తేడాతో ఉన్నారు. అంటే మహిళలు స్వల్ప ఆధిక్యంతో మెరుగైన డ్రైవర్లుగా నిలిచారు. అయితే డ్రైవర్లలో ఎక్కువగా కనిపించిన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, ఒక్కసారిగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ రెండు అంశాలకు వరుసగా 87, 91 స్కోర్లు నమోదయ్యాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారీ వర్షాలు, చలికాలంలో పొగమంచు వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
19 శాతం మంది పాదచారులే..
భారతదేశంలో రోడ్డు భద్రత ఇప్పటికీ తీవ్ర సవాలుగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక విడుదలైంది. ప్రతి ఏడాది దేశంలో సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. అలాగే ఈ ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం మరణాల్లో 44 శాతం మంది బైక్, స్కూటర్ వంటి ద్విచక్ర వాహనదారులే కాగా, మరో 19 శాతం మంది పాదచారులేనని నివేదిక వెల్లడించింది.
వివరాలు
2030 లక్ష్యంపై దృష్టి..
స్టాక్‌హోమ్ డిక్లరేషన్ ప్రకారం 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం మెరుగైన రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే సరిపోదని జునో జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షానై ఘోష్ అన్నారు. డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత చర్యలు తీసుకోవడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.