Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం.. ఎనిమిది మంది అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం,చోరీ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు అయోధ్యలోని కోత్వాలి రామ్‌జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు, ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రాతో పాటు మొత్తం ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. వీరిలో అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రాలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
నిందితుల్లో ఆరుగురు ఆలయ ఉద్యోగులే..
మిగిలిన నిందితుల్లో అవినాష్ శుక్లా, తిన్ను యాదవ్, మనీష్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్ ఉన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, విరాళాల లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది రూ.100 నోట్ల కట్టల్లో అదనంగా నోట్లు దాచిపెట్టి వాటిని తర్వాత పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, నిందితుల్లో ఆరుగురు ఆలయ ఉద్యోగులే. వీరు నగదు దుర్వినియోగానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ఎస్‌ఐటీలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు.
వివరాలు
BNS లోని పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు
ఈ బృందం తన ప్రాథమిక నివేదికను అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు సమర్పించింది. అనంతరం లక్నో చేరుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ నివేదికను సమీక్షించారు. ట్రస్ట్‌కు అయోధ్య పోలీసులు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. ఆలయ నిర్వహణలో మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలనే సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేయడానికి ఎస్‌ఐటీ మరోసారి అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. తుది నివేదికను 15 రోజుల్లో ముఖ్యమంత్రికి సమర్పించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.