LOADING...
Sony layoffs: డెస్టినీ 2కు ముగింపు.. బంగీలో భారీ లేఆఫ్స్, ఉద్యోగులకు సోనీ షాక్
డెస్టినీ 2కు ముగింపు.. బంగీలో భారీ లేఆఫ్స్, ఉద్యోగులకు సోనీ షాక్

Sony layoffs: డెస్టినీ 2కు ముగింపు.. బంగీలో భారీ లేఆఫ్స్, ఉద్యోగులకు సోనీ షాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత గేమ్ డెవలప్‌మెంట్ సంస్థ బంగీ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు ప్రకటించింది. 2022లో సోనీ సంస్థ 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ.30 వేల కోట్లు)వ్యయంతో బంగీ స్టూడియోను కొనుగోలు చేసింది. ప్రస్తుతం వ్యయ నియంత్రణ, సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా బంగీకి గుర్తింపు తీసుకొచ్చిన 'డెస్టినీ' సిరీస్‌పై పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు 'మారథాన్' గేమ్ అభివృద్ధి బృందంలోని కొంతమంది సిబ్బందిపై కూడా లేఆఫ్స్ ప్రభావం పడింది. జూన్ 25న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కంపెనీ కీలక విషయాలను వెల్లడించింది. గత కొంతకాలంగా 'డెస్టినీ 2' గేమ్ ఆశించిన స్థాయిలో ఆదరణ, ఆదాయాన్ని సాధించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

వివరాలు 

అంచనాలను అందుకోలేకపోయిన 'డెస్టినీ 2'

బంగీ ఉద్యోగులతో పాటు సంస్థకు మద్దతు అందిస్తున్న సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కొంతమంది సిబ్బంది కూడా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఉన్నారని పేర్కొంది. ఈ అంశంపై బంగీ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. గత కొన్ని సంవత్సరాలుగా 'డెస్టినీ 2' తమ అంచనాలను అందుకోలేకపోయిందని అంగీకరించింది. అలాగే ఈ గేమ్‌కు సంబంధించిన చివరి కంటెంట్ అప్‌డేట్ కూడా పూర్తయిందని వెల్లడించింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉండటంతో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో సంస్థను కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్లేస్టేషన్ స్టూడియోస్ అధినేత హెర్మెన్ హల్స్ట్ కూడా స్పందించారు.

వివరాలు 

పదేళ్లుగా కొనసాగుతున్న 'డెస్టినీ 2' లైవ్ సర్వీస్ అప్‌డేట్స్

ఉద్యోగుల తొలగింపు చాలా బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ, సంస్థ భవిష్యత్తు, దీర్ఘకాలిక వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న 'డెస్టినీ 2' లైవ్ సర్వీస్ అప్‌డేట్స్ ఈ జూన్‌తో పూర్తిగా ముగిశాయి. గేమ్ అందుబాటులో కొనసాగినప్పటికీ, కొత్త వెర్షన్లు లేదా 'డెస్టినీ 3'ను విడుదల చేసే ప్రణాళిక ప్రస్తుతం లేదని బంగీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'మారథాన్' గేమ్ కూడా మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని వెల్లడించింది.

Advertisement

వివరాలు 

ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర విభాగాల్లో తగిన అవకాశాలు

గేమింగ్ పరిశ్రమలో నిర్మాణ వ్యయాలు పెరగడం, వినియోగదారుల అభిరుచులు వేగంగా మారడం వల్ల ప్రముఖ స్టూడియోలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగీ సంస్థ 2023, 2024లో చేపట్టిన ఉద్యోగుల కోతల తర్వాత ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి సోనీ నెట్‌వర్క్‌లోని ఇతర విభాగాల్లో తగిన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది.

Advertisement