Page Loader
Health insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 71 శాతం పరిష్కారం.. నివేదికిచ్చిన ఐఆర్‌డీఏఐ
ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 71 శాతం పరిష్కారం.. నివేదికిచ్చిన ఐఆర్‌డీఏఐ

Health insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 71 శాతం పరిష్కారం.. నివేదికిచ్చిన ఐఆర్‌డీఏఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరోగ్య బీమా సంస్థలు మొత్తం ఫైల్ అయిన క్లెయిమ్‌లలో 71.3 శాతం విలువైన క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించాయి. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ తన నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1.2 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లు ఫైల్‌ అయ్యాయి. వాటిలో రూ.1.1 లక్షల కోట్ల విలువైన 3 కోట్ల కొత్త క్లెయిమ్‌లు, గత సంవత్సరాలకు సంబంధించిన రూ.6,290 కోట్ల క్లెయిమ్‌లు ఉన్నాయి.

Details

పెండింగ్‌లో  6.4 శాతం క్లెయిమ్‌లు 

మొత్తం క్లెయిమ్‌లలో రూ.83,493 కోట్ల విలువైన 2.7 కోట్ల క్లెయిమ్‌లను బీమా సంస్థలు పరిష్కరించాయని IRDAI పేర్కొంది. సంఖ్యా పరంగా 82 శాతం క్లెయిమ్‌లు పరిష్కరించగా, విలువ పరంగా 71.3 శాతం చెల్లింపులు జరిగాయి. అయితే టర్మ్స్ & కండీషన్స్ పరిధికి రానిచ్చిన కారణాలతో రూ.15,100 కోట్ల విలువైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను నిరాకరించాయి. అదనంగా రూ.1,093 కోట్ల విలువైన 3.6 లక్షల పాలసీలు తిరస్కరించారు. ఇంకా రూ.7,584 కోట్ల విలువైన 6.4 శాతం క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో, బీమా సంస్థలు రూ.1.1 లక్షల కోట్ల విలువైన ఆరోగ్య బీమా ప్రీమియాలు వసూలు చేశాయి.

Details

రూ.34,503 కోట్లు వసూలు చేసిన ప్రయివేటు కంపెనీలు

వాటిలో, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు రూ.40,993 కోట్లు వసూలు చేశాయంటే, ప్రైవేట్ కంపెనీలు రూ.34,503 కోట్లు వసూలు చేశాయి. స్టాండ్-అలోన్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.32,180 కోట్ల ప్రీమియాలను అందుకున్నాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల తిరస్కరణను నివారించాలంటే, పూర్తిగా డాక్యుమెంట్లు సమర్పించడం, టర్మ్స్ & కండీషన్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. 34,000కు పైగా ఫిర్యాదులు ఆరోగ్య బీమా అంబుడ్స్‌మన్ వద్ద 2023-24 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి.