Loading...
8th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. కొత్త వేతనాలపై కీలక వివరాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. కొత్త వేతనాలపై కీలక వివరాలు

8th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. కొత్త వేతనాలపై కీలక వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

8వ వేతన సంఘం (8th Pay Commission) నివేదిక కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు,ఇతర అలవెన్సుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వేతన సంఘం తన నివేదికను ఎప్పుడు సమర్పిస్తుంది? కేంద్ర ప్రభుత్వం దానిని ఎప్పుడు ఆమోదించి అమలు చేస్తుందనే అంశాలపై కొత్త వేతనాల అమలు ఆధారపడి ఉంటుంది. న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిషన్‌గా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2025 నవంబర్ 3న ఈ కమిషన్ ఏర్పాటైంది. తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చారు.

వివరాలు 

2027 మేలో 8వ వేతన సంఘం నివేదిక.. ఉద్యోగులకు ముందే కీలక అప్‌డేట్‌!

ఈ లెక్కన 2027 మే నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అయితే నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో కొత్త జీతాలు జమ కావు.

8వ వేతన సంఘం నివేదిక గడువుపై బ్యాంక్‌బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.. 2025 నవంబర్‌లో కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి 18 నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ లెక్కన 2027 మే నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు.

అయితే కొన్ని ప్రత్యేక అంశాలపై మధ్యంతర నివేదికలు (Interim Reports) సమర్పించే వెసులుబాటు కూడా కమిషన్‌కు ఉందని చెప్పారు.

దీంతో తుది నివేదిక రాకముందే కొన్ని సిఫార్సులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

వివరాలు 

సిఫార్సుల అమలుపై కేంద్రానిదే తుది నిర్ణయం

ఇలాంటి విస్తృతమైన ప్రక్రియలో ఉద్యోగుల వేతనాలు, సేవా నిబంధనలకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని, అవసరమైతే కమిషన్ గడువు పొడిగింపు కోరే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.

అయితే మధ్యంతర నివేదికలు వచ్చినంత మాత్రాన జీతాలు, పెన్షన్లు వెంటనే పెరుగుతాయని భావించకూడదు. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే.

కమిషన్ సిఫార్సులను పరిశీలించిన తర్వాత ఏ అంశాలను ఆమోదించాలి? వేటిని తిరస్కరించాలి? మరికొన్నింటిలో ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయాలను ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది.

ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోవాలి.

తుది నివేదిక పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే అమలుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటుకు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త వేతనాలు, పెన్షన్ల అమలు ఎప్పటి నుంచి?

కాబట్టి 2027 మే అనేది నివేదిక సమర్పణకు సంబంధించిన అంచనా గడువు మాత్రమే. కొత్త జీతాలు అమల్లోకి వచ్చే తేదీ కాదు.

సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరించి, 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

అయితే ఇది ఉద్యోగులకు ఆ తేదీ నుంచే కొత్త జీతాలు అందుతాయని నిర్ధారించదు.

వాస్తవంగా కొత్త వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారు? అప్పటి వరకు రావాల్సిన బకాయిలు (Arrears) ఎప్పుడు అందిస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం.

ADVERTISEMENT

వివరాలు 

8వ వేతన సంఘం నివేదికపై ఇంకా ఉత్కంఠే..

ప్రస్తుతానికి 2027 మే నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కమిషన్ గడువు పొడిగింపు కోరితే ఈ తేదీలో మార్పు రావచ్చు.

నివేదిక, ప్రభుత్వ ఆమోదం, అమలు ప్రక్రియ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేచి చూడాల్సిందే.

8వ వేతన సంఘానికి సంబంధించిన అధికారిక సమాచారం కోసం https://8cpc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ADVERTISEMENT