8th Pay Commission: 8వ వేతన సంఘానికి పెన్షనర్ల వినతి.. 15 ఏళ్ల కోతపై సమీక్షకు డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు,ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ వ్యవధి తగ్గింపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 15 ఏళ్ల వ్యవధిని 11 లేదా 12 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పలు పెన్షనర్ల సంఘాలు 8వ వేతన సంఘానికి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించాయి. కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ వ్యవధిని 15 ఏళ్లుగా కొనసాగించడాన్ని సమర్థిస్తూ ఇటీవల రెండు వేర్వేరు హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. అయితే, నిపుణుల కమిటీ ద్వారా ఆక్చువేరియల్ అసెస్మెంట్ నిర్వహించి ఈ వ్యవధిని సమీక్షించే అవకాశం ఉందని న్యాయస్థానాలు సూచించాయి. ఈ రెండు తీర్పుల వివరాలను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ విడుదల చేసిన సంక్షిప్త నివేదికలో పొందుపరచడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపైనా ప్రభావం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వేలాది మంది కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు నివసిస్తున్నారు.
రైల్వే, పోస్టల్, ఆదాయపు పన్ను, రక్షణ, ఇతర పౌర విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు ఈ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుంటాయి.
దీంతో 8వ వేతన సంఘం తీసుకోబోయే నిర్ణయం తెలుగు రాష్ట్రాల పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపైనా ప్రభావం చూపనుంది.
వివరాలు
కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఏమిటి?
ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందుతారు.
అయితే, వారు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే ఒకేసారి నగదు రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధానాన్నే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అంటారు. ఉద్యోగి ముందుగానే తీసుకున్న మొత్తానికి అనుగుణంగా నెలవారీ పెన్షన్‌లో కొంత కోత విధిస్తారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ కోత 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది.
ఆ గడువు ముగిసిన తర్వాత పెన్షన్‌లో కోత విధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభిస్తారు. దీంతో పెన్షనర్‌కు పూర్తి పెన్షన్ అందుతుంది.
వివరాలు
హైకోర్టుల తీర్పులు ఏమి చెబుతున్నాయి?
పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పు
2024 నవంబర్ 27న పంజాబ్, హరియాణా హైకోర్టు 15 ఏళ్ల పెన్షన్ రికవరీ వ్యవధిని సవాలు చేస్తూ దాఖలైన 808 రిట్ పిటిషన్లను కొట్టివేసింది.
జస్టిస్ లిసా గిల్, జస్టిస్ సుఖ్వీందర్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ఉద్యోగులు తమ ఇష్టప్రకారమే కమ్యూటేషన్ ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందారని ధర్మాసనం పేర్కొంది.
ఈ ప్రయోజనం పొందిన తర్వాత 11.5 లేదా 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.
ఈ అంశం నిపుణుల పరిధిలోకి వస్తుందని తెలిపింది.
వివరాలు
దిల్లీ హైకోర్టు తీర్పు
2026 మే 29న యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సబ్ త్రిలోక్ చంద్ కేసులో దిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
జస్టిస్ అనిల్ క్షేతర్‌పాల్,జస్టిస్ అమిత్ మహాజన్లతో కూడిన ధర్మాసనం 1981 నాటి సీసీఎస్ (కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్) రూల్10-ఏ చెల్లుబాటును సమర్థించింది.
పెన్షన్ రికవరీకి 15ఏళ్ల వ్యవధిని నిర్ణయించడం ప్రభుత్వం ఆక్చువేరియల్ మూల్యాంకనం ఆధారంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
ఇందులో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది.
ఈ రెండు తీర్పుల నేపథ్యంలో న్యాయస్థానాల ద్వారా 15ఏళ్ల వ్యవధిని తగ్గించుకోవడం కష్టమని పెన్షనర్లు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ లేదా 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారానే ఈ విషయంలో మార్పు సాధ్యమయ్యే అవకాశముంది.
వివరాలు
పెన్షనర్ల సంఘాల ప్రధాన డిమాండ్లు
కోర్టుల్లో ఆశించిన ఊరట లభించకపోవడంతో పెన్షనర్ల సంఘాలు ఇప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సులపై ఆశలు పెట్టుకున్నాయి.వివిధ సంఘాలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
భారత్ పెన్షనర్స్ సమాజ్ (బీపీఎస్): 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని 11 ఏళ్లకు తగ్గించాలని ఈ సంఘం కోరింది.లేదంటే,పెన్షనర్‌కు 71 ఏళ్లు నిండిన వెంటనే పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రతిపాదించింది.
ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్: ఉద్యోగులకు ముందుగా చెల్లించిన కమ్యూటేషన్ అసలు మొత్తాన్ని, దానిపై వడ్డీని ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లలోనే తిరిగి పొందుతోందని ఈ సంఘం పేర్కొంది. అలాంటప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్‌లో కోత కొనసాగించడం అదనపు వసూలుతో సమానమని వాదించింది.
వివరాలు
ఆక్చువేరియల్ కమిటీ సమీక్ష కీలకం కానుందా?
ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్: ఈ సంఘాలు కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ వ్యవధిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశాయి. వృద్ధాప్యంలో పెన్షనర్లపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ మార్పు అవసరమని పేర్కొన్నాయి.
కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ వ్యవధిని సమీక్షించేందుకు ఆక్చువేరియల్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పెన్షనర్ల సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ డేటా ఆధారంగా 8వ వేతన సంఘం ఈ అంశాన్ని సమీక్షిస్తే 15 ఏళ్ల నిబంధనను 11 లేదా 12 ఏళ్లకు తగ్గించే అవకాశం ఉండొచ్చు.
వివరాలు
ఆక్చువేరియల్ కమిటీ సమీక్ష కీలకం కానుందా?
అదే జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
పెన్షన్‌లో కోత త్వరగా ముగియడంతో వృద్ధాప్యంలో నెలకు వేల రూపాయల అదనపు ఆదాయం అందుతుంది.
అయితే, ఈ మార్పుపై ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు. 8వ వేతన సంఘం సిఫార్సులు, ప్రభుత్వ నిర్ణయాలపై పెన్షనర్ల ఆశలు ఆధారపడి ఉన్నాయి.