Adani: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్'ని ప్రారంభించిన అదానీ
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని ఖవ్డా ప్రాంతంలో భారీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను ప్రారంభించింది. 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. కేవలం 10 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం విశేషం. భారత్‌లో పెరుగుతున్న స్వచ్ఛ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. ఇండోర్, చండీగఢ్, గోవా వంటి నగరాల్లో విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
వివరాలు
ఒక రోజంతా 10 లక్షల ఇళ్లకు విద్యుత్ అందించే సామర్థ్యం
ఖావ్డా BESS ద్వారా నిల్వ చేసే స్వచ్ఛ ఇంధనం దాదాపు 10 లక్షల ఇళ్లకు ఒక రోజు పాటు విద్యుత్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 1.2 కోట్లకు పైగా LED బల్బులను 10 గంటల పాటు నిరంతరం వెలిగించగలదు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా విద్యుత్ గ్రిడ్ స్థిరత్వం మెరుగుపడటంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం మరింత సమర్థవంతంగా మారనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ మాట్లాడుతూ, భారత స్వచ్ఛ ఇంధన మార్పులో భారీ స్థాయి స్టోరేజ్ వ్యవస్థలు అత్యంత కీలకమని తెలిపారు.
వివరాలు
మరింత బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచనున్న AGEL
ఈ ఖావ్డా BESSలో అత్యాధునిక ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో పాటు లిథియం-అయాన్ టెక్నాలజీని వినియోగించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేస్తున్న భారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది నిర్మించబడింది. 2029 నాటికి మొత్తం 30 గిగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇప్పటికే 9.9 గిగావాట్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇక 2027 ఆర్థిక సంవత్సరానికి 10 GWhకు పైగా బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాన్ని జోడించాలని, వచ్చే ఐదేళ్లలో దాన్ని 50 GWh వరకు పెంచాలని AGEL ప్రణాళికలు సిద్ధం చేసింది.