Adani Ports: యూరప్‌లో అదానీ పోర్ట్స్ భారీ డీల్.. రూ.22 వేల కోట్లతో ఈవోస్ కొనుగోలు!
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్‌లోని ప్రముఖ లిక్విడ్ స్టోరేజీ సంస్థ ఈవోస్ బీవీని కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) సిద్ధమైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 2.56 బిలియన్ యూరోలు (సుమారు 2.5 బిలియన్ యూరోలు). నగదు రూపంలో జరిగే ఈ లావాదేవీకి అప్పుల ద్వారా నిధులు సమకూర్చుకోనున్నారు. అయితే, ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల అనుమతులు, ఉద్యోగుల ప్రతినిధి మండలి సంప్రదింపులు అవసరం.
వివరాలు
2025లో ఈవోస్ ఆదాయం 392 మిలియన్ యూరోలు
ఈవోస్ యూరప్‌లో రెండో అతిపెద్ద స్వతంత్ర ద్రవ ఇంధన నిల్వల నిర్వహణ సంస్థగా ఉంది.
ఈ సంస్థకు మొత్తం 63 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది.
నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, బెల్జియం, మాల్టా దేశాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఎనిమిది పోర్టు ఆధారిత టెర్మినళ్లను నిర్వహిస్తోంది.
2025 క్యాలెండర్ సంవత్సరంలో ఈవోస్ 392 మిలియన్ యూరోల ఆదాయాన్ని, 219 మిలియన్ యూరోల EBITDAను నమోదు చేసింది. EBITDA మార్జిన్ 56 శాతంగా ఉంది.
వివరాలు
10 దేశాల్లో 28 పోర్టులకు విస్తరించనున్న అదానీ పోర్ట్స్
ఈవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్ వ్యాపార విస్తృతి, భౌగోళిక వైవిధ్యం, నగదు ప్రవాహం మెరుగుపడనున్నాయి.
ఈ ఒప్పందం పూర్తయితే 10 దేశాల్లో 28 పోర్టులు, టెర్మినళ్లతో సంస్థ కార్యకలాపాలు విస్తరించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ద్రవ ఇంధన నిల్వ కేంద్రాలు, ఇంధన హబ్‌లలో తమ ఉనికి మరింత బలపడుతుందని అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు.
ఈవోస్‌ను తమ సంస్థలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
యూరప్‌లో కీలక ఇంధన కేంద్రాల్లో ఈవోస్ కార్యకలాపాలు
యూరప్‌లోని ప్రధాన ఇంధన, పారిశ్రామిక కేంద్రాల్లో ఈవోస్ టెర్మినళ్లు ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్-రోటర్‌డామ్-ఆంట్వెర్ప్ (ARA) ప్రాంతం, హాంబర్గ్, మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి.
ఈవోస్ నిర్వహణలో 452 ట్యాంకులు, 63 నౌకలు, బార్జ్ బెర్త్‌లు ఉన్నాయి.
షిఫోల్ విమానాశ్రయం, సెంట్రల్ యూరప్ పైప్‌లైన్ వ్యవస్థ వంటి కీలక ప్రాంతాలకు అనుసంధానమైన పైప్‌లైన్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
సాంప్రదాయ ఇంధనాలతో పాటు భవిష్యత్తులో వినియోగం పెరగనున్న ఇంధనాల నిల్వ, నిర్వహణలోనూ ఈవోస్ సేవలు అందిస్తోంది.
గ్యాసోలిన్, గ్యాస్ ఆయిల్, మెరైన్ ఫ్యూయల్స్, విమాన ఇంధనం, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF), బయోఫ్యూయల్స్, మెథనాల్, బయోఇథనాల్ వంటి ఇంధనాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.