Loading...
AI Cyberattacks: ఏఐ సైబర్‌ దాడులతో చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.300 కోట్ల నష్టం
ఏఐ సైబర్‌ దాడులతో చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.300 కోట్ల నష్టం

AI Cyberattacks: ఏఐ సైబర్‌ దాడులతో చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.300 కోట్ల నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)పై ఇటీవల వరుసగా జరిగిన సైబర్‌ దాడులతో సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ప్రధానంగా చిన్న ఎన్‌బీఎఫ్‌సీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించి దాదాపు 150 ఫిర్యాదులు లేదా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వరుస దాడులతో ఆందోళన పెరగడంతో సైబర్‌ భద్రతా సంస్థలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్నాయి.

వివరాలు 

బలహీనమైన సైబర్ భద్రతా వ్యవస్థలే లక్ష్యంగా దాడులు

చిన్న ఎన్‌బీఎఫ్‌సీల్లో సైబర్‌ భద్రతా వ్యవస్థలు బలహీనంగా ఉండటాన్ని హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రూ.1,000 కోట్ల వరకు లేదా అంతకంటే తక్కువ వార్షిక టర్నోవర్‌ ఉన్న సంస్థలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ఢిల్లీలోని ఓ ఎన్‌బీఎఫ్‌సీపై జరిగిన సైబర్‌ దాడిలో రూ.7.5 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో దాడి జరగడంతో అదనంగా రూ.7.25 కోట్లు కోల్పోయింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్‌ భద్రతా వ్యవస్థలను వీలైనంత త్వరగా మెరుగుపరచుకోవాలని సంబంధిత సంస్థలకు భద్రతా ఏజెన్సీలు సూచిస్తున్నాయి.

వివరాలు 

కొన్ని దాడుల వెనుక చైనా హ్యాకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సైబర్‌స్ట్రైక్

ఇప్పటికే పూర్తయిన కొన్ని దర్యాప్తుల్లో సైబర్‌స్ట్రైక్‌ (CyberStrike) అనే చైనా హ్యాకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ పాత్రను సైబర్‌ భద్రతా సంస్థలు గుర్తించినట్లు సమాచారం.

ఆర్టెక్స్‌ (Artex), సైబర్‌స్ట్రైక్‌ అనే రెండు చైనా ఏఐ టూల్‌కిట్లతో పాటు డీప్‌సీక్‌ (DeepSeek), అలీబాబాకు చెందిన క్వెన్‌ (Qwen), మూన్‌షాట్‌ కిమి (Kimi), జిపు జీఎల్‌ఎం (GLM) వంటి ఇతర ఓపెన్‌ సోర్స్‌ ఏఐ మోడళ్లను కలిపి ఉపయోగిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

వీటి సాయంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై సైబర్‌ దాడులు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ టూల్స్‌తో సైబర్‌ దాడుల వేగం పెరిగింది: సీఈఆర్‌టీ-ఇన్‌ హెచ్చరిక

భారత్‌లో సైబర్‌ భద్రతకు సంబంధించిన కీలక సంస్థ అయిన సీఈఆర్‌టీ-ఇన్‌ (CERT-In) ఏఐ టూల్స్‌ వల్ల సైబర్‌ దాడుల ముప్పు పెరుగుతోందని హెచ్చరించింది.

గతంలో ఓ వ్యవస్థలోకి చొరబడిన తర్వాత నష్టం కలిగించేందుకు దాడి చేసేవారికి రోజులు పట్టేవని, ఇప్పుడు ఆ సమయం కొన్ని గంటలకు తగ్గిపోయిందని తెలిపింది.

సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను పూర్తిగా సరిచేయని సంస్థలపై కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి దాడులు జరిగాయని,ఈసారి దాడుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది.

ఆర్టెక్స్‌, సైబర్‌స్ట్రైక్‌లకు సంబంధించిన హెచ్చరికలను ప్రాధాన్యంగా పరిశీలించాలని, లక్ష్యంగా చేసుకుని మోసపూరిత సందేశాలు పంపడం,సాంకేతిక లోపాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు తమ రెడ్‌ టీమ్‌లను అప్రమత్తం చేయాలని సంస్థలకు సీఈఆర్‌టీ-ఇన్‌ సూచించింది.

ADVERTISEMENT