IATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రజలు విమాన ప్రయాణాలపై ఆసక్తిని కనబరుస్తున్నారని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ చెప్పారు. ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. కరోనాకు ముందు 2019లో ఉన్న ప్రయాణికుల రద్దీ 90శాతానికి పైగా ఇప్పుడు ఉందని విల్లీ వాల్ష్ వెల్లడించారు. విమానాశ్రయాలు రద్దీగా ఉన్నాయని, హోటల్ ఆక్యుపెన్సీ పెరుగుతోందని, స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయని, విమానయాన పరిశ్రమ లాభాల్లోకి వెళ్లిందని అన్నారు.
సగటున ఒక్కో ప్రయాణికుడి నుంచి 2.25 డాలర్ల ఆర్జన
ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 803 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 9.8 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. విమానయాన సంస్థలు సగటున ఒక్కో ప్రయాణికుడి నుంచి 2.25 డాలర్లు ఆర్జిస్తాయని ఆయన చెప్పారు. కోవిడ్ తర్వాత విమానయాన పరిశ్రమ కోలుకుంటున్నప్పటికీ, ఖర్చు ఒత్తిడి, సరఫరా-గొలుసు సమస్యలు వంటి సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) అడ్డంకులను ఎదుర్కోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఖర్చులను పెంచుతాయని, విమానాల సామర్థ్యాన్ని కూడా పరిమితం చేస్తాయని వెల్లడించారు.