IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు
ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది. 2021తో పోలిస్తే 2022సంవత్సరంలో ప్రయాణాలు పూర్తిస్థాయిలో పెరిగినట్లు చెప్పింది. 2021తో పోలిస్తే భారత దేశీయ ఆర్‌పీకే (రెవెన్యూ ప్యాసింజర్ కిలోమీటర్లు)లు 2022లో 48.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఐఏటీఏ తెలిపింది. కరోనా తర్వాత తొలిసారిగా 2019లో నమోదైన ప్రయాణాల్లో 85.7శాతానికి దేశీయ విమాన ప్రయాణాలు చేరుకున్నట్లు పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కూడా కరోనాకు ముందు స్థితికి చేరుకుంది. 2019తో పోలిస్తే కేవలం 3.6శాతం క్షీణత నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా 2022లో ప్రయాణీకుల రద్దీ 64.4 శాతం పెరిగింది: ఐఏటీఏ
దేశంలో విమాన ప్రయాణాలు భారీగా పెరగడంతో ఎయిర్ కంపెనీలకు కూడా ఆదాయంలో భారీగా మెరుగుదల కనిపించినట్లు ఐఏటీఏ చెప్పింది. 2021కంటే 2022లో ASK(Available Seat Kilometres) 30.1శాతం పెరిగినట్లు పేర్కొంది. ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో డొమెస్టిస్ విమాన ప్రయాణాలను చూసుకుంటే, జపాన్‌లో కూడా మంచి స్థాయిలో వృద్ధి సాధించినట్లు ఐఏటీఏ నివేదించింది. జపాన్‌లో ఆర్‌పీకే 2021తో పోలిస్తే 2022లో 75.9శాతం పుంజుకున్నట్లు చెప్పింది. ఆస్ట్రేలియా కూడా ఇదే రీబౌండ్‌ను చవిచూసినట్లు వెల్లడించింది. 2022 వరకు చైనా కరోనా ఆంక్షల నడుమ ఉన్నందున 2021తో పోలిస్తే ఆర్‌పీకే 39.8శాతం, ఏఎస్‌కే 35.2 శాతం క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా 2021 ఏడాదితో పోలిస్తే 2022లో మొత్తం ప్రయాణీకుల రద్దీ 64.4 శాతం పెరిగినట్లు ఐఏటీఏ వెల్లడించింది.