టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది. అబుదాబి విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు కనిపించాయి. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ వెల్లడించింది.
1000 అడుగుల పైకి వెళ్లిన తర్వాత ఇంజిన్‌లో మంటలు గుర్తింపు
విమానం 1000 అడుగుల పైకి వెళ్లిన తర్వాత పైలెట్ ఇంజిన్‌లో మంటలు గుర్తించినట్లు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ క్రమంలో అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాశ్రయానికి తిరిగి రావాలని పైలెట్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. జనవరి 23 సంఘటన కూడా ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. త్రివేండ్రం-మస్కట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఆ సమయలో ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్)లో సమస్య తలెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు వారాల్లోనే ఎయిర్ ఇండియాకు ఇది రెండో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం గమనార్హం.