విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏవియేషన్ రెగ్యులేటర్ ఫ్లైట్ పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఇన్-ఫ్లైట్ సర్వీస్‌కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. 2022 నవంబర్ 26న న్యూయార్క్-దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం తాగి తనపై మూత్ర విసర్జన చేశాడని శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడిపై తోటి మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసింది. ఈకేసులో శంకర్ మిశ్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు నిషేధాన్ని విధించిన ఎయిర్ ఇండియా
ఈ వ్యవహారానికి కారణమైన శంకర్‌మిశ్రా ఎయిర్ఇండియా ఎయిర్ లైన్స్ కూడా చర్యలు తీసుకుంది. నాలుగు నెలలపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. మిగతా విమానయాన సంస్థలు కూడా నిషధాన్ని విధించే అవకాశం ఉంది. విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారినా.. నిందితుడు శంకర్ మిశ్రా మాత్రం తాను ఆ పని చేయలేదని చెప్పడం గమనార్హం. మొదటిసారి నవంబర్ 27న ఎయిర్ ఇండియాకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. నవంబర్ 30న ఎయిర్ ఇండియా శంకర్ మిశ్రా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అప్పటిదాకా సంస్థాగతంగా జరిగిన ఈ వ్యవహారం, బాధిత మహిళ టాటా సన్స్ చైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో విషయం బహిరంగమైంది.