ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డీజీసీఏ మరోసారి షాక్ ఇచ్చింది. న్యూయార్క్-దిల్లీ వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ, తాజాగా అలాంటి సంఘటనలో రూ. 10లక్షల ఫైన్ విధించింది. వారం లోపలే ఎయిర్ ఇండియాకు ఈ రెండు ఫైన్లు విధించడం గమనార్హం. డిసెంబరు 6న ప్యారిస్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI-142 ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు తాగుబోతులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఒక ప్రయాణికుడు మహిళ దుప్పటిపై మూత్రవిసర్జన చేయగా.. మరొక ప్రయాణికుడు ధూమపానం చేశాడు.
ఎయిర్ ఇండియా సమాధానానికి సంతృప్తి చెందని డీజీసీఏ
జనవరి 5న తాము అడిగే వరకు ఎయిర్ ఇండియా AI-142లో జరిగిన ఘటన గురించి చెప్పకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని జనవరి 10న షోకాజు నోటీసు జారీ చేసింది. జనవరి 23లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. షోకాజు నోటీసుకు ప్రతిస్పందనగా ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సరిగా లేకపోవడంతో రూ.10లక్షల జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ చెప్పింది. అలాగే విమానయాన సంస్థకు ఫైన్ విధించిన డీజీసీఏ, అందులోని సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకునేది ఇలా వెల్లడించలేదు.