ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్
విమానాల్లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి. న్యూయార్క్- దిల్లీ, దిల్లీ-పాట్నా ఘటనలు మరవకముందే.. మరోసారి ఇలాంటి వార్తే ఆలస్యంగా బయటకు వచ్చింది. డిసెంబరు 6న ప్యారిస్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI-142 ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు తాగుబోతులు వికృత చేష్టలకు పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రయాణికుడు మహిళ దుప్పటిపై మూత్రవిసర్జన చేయగా.. మరొక ప్రయాణికుడు ధూమపానం చేసిన విషయాలు.. ఎయిర్ ఇండియా దాచిపెట్టడం వల్లే బయటకు రాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భావిస్తోంది. అందుకే ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
రెండు వారాల గడువు
జనవరి 5న తాము నివేదకను కోరే వరకు ఎయిర్ ఇండియా ఈ ఘటన గురించి నివేదించకపోవడంపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఎయిర్‌లైన్ తీరు లోపభూయిష్టంగా ఉందని డీజీసీఏ చెప్పింది. నియంత్రణ బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ఎయిర్ ఇండియాను నోటీసులో పేర్కొంది. సమాధానం ఇవ్వడానికి ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రెండు వారాల గడువు విధించింది. అకౌంటబుల్ మేనేజర్ ఇచ్చే సమాధానం ఆధారంగా సహజ న్యాయ నిబంధనలకు అనుగుణంగా అదనపు చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలో నవంబర్‌లో జరిగిన సంఘటన కూడా సంచలనంగా మారింది. ఆ కేసులోని నిందితుడు శంకర్ మిశ్రా ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యాడు.