Andhra Pradesh: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధుల గుర్తింపు నుంచి చికిత్స నిర్ణయాల వరకు ఈ సాంకేతికతను వైద్యులు సమర్థంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో ఏఐ ఆధారిత క్లినిక్‌లు సేవలు అందిస్తున్నాయి. భారత్‌లోనూ ఇలాంటి ఆధునిక వైద్య విధానాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం'ఇండియా ఏఐ సమిట్' పేరుతో జాతీయ వ్యూహాన్ని రూపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. సాంకేతికతలో ముందున్నఆంధ్రప్రదేశ్‌లో గతేడాది డిసెంబరులోనే తొలి ఇండియా ఏఐ సదస్సు నిర్వహించారు. త్వరలో జాతీయ విధానాన్ని ఖరారు చేయనున్న నేపథ్యంలో,రాష్ట్రానికి ప్రత్యేకమైన వ్యూహంతో సిద్ధంగా ఉండేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏఐ అమలుతో సేవల వేగం,పారదర్శకత పెరుగుతాయని,'ఆరోగ్య ఆంధ్ర'లక్ష్యం సాకారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
దోమల నియంత్రణకు డ్రోన్ సాంకేతికత
రాష్ట్రంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తోంది. మన్యంతో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరిస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, రక్త యూనిట్లు పంపించడంతో పాటు, అక్కడి నుంచి రక్తం, మల, మూత్ర నమూనాలను పరీక్షల కోసం తరలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ సేవలు అందించేందుకు రెడ్‌వింగ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాలు
క్షయ నివారణలో ఏఐ పాత్ర
క్షయవ్యాధి నియంత్రణ దిశగా ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్షయ ప్రభావిత ప్రాంతాల మ్యాపింగ్, స్క్రీనింగ్‌ను ఏఐ ద్వారా నిర్వహించే విధానాన్ని అమలు చేయనున్నారు. మొబైల్ ఆధారిత పరికరాల సహాయంతో దగ్గు శబ్దం తీవ్రత, ఇతర లక్షణాలను విశ్లేషించి క్షయను అంచనా వేసే సాంకేతికతను క్షేత్రస్థాయి వైద్య సిబ్బందికి త్వరలో అందుబాటులోకి తేనున్నారు. క్షయ రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, మరణ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, అధిక ప్రమాదం ఉన్న టీబీ కేసులకు వేగంగా చికిత్స అందించడం వంటి ప్రణాళికలు రూపొందించారు.
వివరాలు
నేత్ర వైద్య సేవల్లో ఆధునికత
డయాబెటిక్ రెటినోపతి గుర్తింపు కోసం వెబ్ ఆధారిత ఏఐ సేవలను త్వరలో ప్రారంభించనున్నారు. మొబైల్ ల్యాబ్ కిట్‌లోని కెమెరాతో తీసిన కంటి రెటీనా చిత్రాలను ఏఐ విశ్లేషించి వ్యాధి తీవ్రతను గుర్తిస్తుంది. ప్రమాద స్థాయిలో ఉన్న రోగులను వెంటనే నేత్ర వైద్యుల వద్దకు రిఫర్ చేయడంలో ఈ విధానం ఉపయోగపడుతుంది. శివారు ప్రాంతాల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇంటి వద్దే తొలి దశ స్క్రీనింగ్ చేయించుకునే అవకాశం కలుగుతుంది. దీంతో స్పెషలిస్టులపై భారం తగ్గనుంది.
వివరాలు
శిశు సంరక్షణలో ఏఐ వినియోగం
42 రోజుల లోపు ఉన్న శిశువుల బరువు, పొడవు, శరీర చుట్టుకొలతలను అంచనా వేసేలా ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సాధనాన్ని ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి అందుబాటులోకి తేనున్నారు. దీని ద్వారా శిశువుల ఆరోగ్యాన్ని ప్రారంభ దశలోనే అంచనా వేసే వీలుంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యే సేవలు ఏఐ ఆధారిత నిర్ధారణ పద్ధతులు, టెలీమెడిసిన్, రిమోట్ మానిటరింగ్, ప్రజారోగ్య డేటా విశ్లేషణ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు, డేటా ఆధారిత ప్రణాళికలు, ఆసుపత్రుల మధ్య వైద్య సేవల్లో సమన్వయం పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
సమగ్ర వ్యూహంతో ముందడుగు
2030 నాటికి దేశవ్యాప్తంగా సురక్షితమైన, ప్రభావవంతమైన ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను అందరికీ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో, ఒకే విధానం కాకుండా ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణమైన వ్యూహాలు అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగా ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో సహకారంతో ఇప్పటికే పలు విధానాలు సిద్ధం చేస్తున్నారు.
వివరాలు
వ్యాధులను ముందుగానే గుర్తించే 'సంజీవని'
వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కాకుండా, ముందుగానే గుర్తించి నివారించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 'సంజీవని' ప్రాజెక్టును కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రజలను ఎక్కువగా వేధించే 10 రకాల వ్యాధులను గుర్తించి, వాటి నివారణపై దృష్టి సారించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా డేటాను విశ్లేషించి, రోగుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి హెల్త్‌కేర్ సేవాదారులకు అందుబాటులోకి తెస్తారు. ఈ విధంగా పలు ఏఐ ఆధారిత వైద్య సేవల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.