recurring snags: రికరింగ్ స్నాగ్స్‌లో ఎయిర్ ఇండియా టాప్,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు 50 శాతం విమానాల్లో మళ్లీ మళ్లీ సాంకేతిక లోపాలు (రికరింగ్ స్నాగ్స్) తలెత్తుతున్నట్లు తేలింది. ఈ జాబితాలో ఎయిర్ ఇండియా గ్రూప్, ఇండిగో కంపెనీల వాటా ఎక్కువగా ఉందని గురువారం లోక్‌సభకు సమర్పించిన డేటాలో వెల్లడైంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆరు షెడ్యూల్‌డ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 754 విమానాలను సాంకేతిక లోపాల కోణంలో పరిశీలించామని ప్రభుత్వం తెలిపింది. వీటిలో 377 విమానాల్లో పునరావృత లోపాలు ఉన్నట్లు గుర్తించినట్టు వెల్లడించింది.
వివరాలు
ఎయిర్ ఇండియా గ్రూప్‌లో లోపాల నిష్పత్తి మరింత ఎక్కువ
ఈ తనిఖీల్లో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 3 నాటికి ఇండిగోకు చెందిన 405 విమానాలను పరిశీలించగా,వాటిలో 148 విమానాల్లో రికరింగ్ డిఫెక్ట్స్ ఉన్నట్లు తేలిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు. అయితే,ఎయిర్ ఇండియా గ్రూప్‌లో లోపాల నిష్పత్తి మరింత ఎక్కువగా నమోదైంది. ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మొత్తం 267 విమానాలను తనిఖీ చేయగా, వాటిలో 191 విమానాల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 72శాతం విమానాల్లో సమస్యలు ఉన్నట్లుగా గణాంకాలు చూపుతున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాల్లో 137 విమానాల్లో,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 101 విమానాల్లో 54 విమానాల్లో రికరింగ్ లోపాలు గుర్తించారు.
వివరాలు
ఈ జాబితాలో ఉన్న ఇతర ఎయిర్‌లైన్స్
ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్పైస్‌జెట్‌కు చెందిన 43 విమానాల్లో 16 విమానాల్లో, అకాసా ఎయిర్‌కు చెందిన 32 విమానాల్లో 14 విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రతినిధి, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యంత జాగ్రత్తగా తమ విమానాలన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేశామని, అందుకే లోపాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
వివరాలు
ఎయిర్ ఇండియాలో ఎక్కువగా కనిపించిన సమస్యలు D కేటగిరీకి చెందినవే
ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ,ఈ లోపాలు ఎక్కువగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పరికరాలకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. విమానాల్లోని వ్యవస్థలను అత్యవసరత ఆధారంగా A నుంచి D కేటగిరీలుగా విభజిస్తారని,ఎయిర్ ఇండియాలో ఎక్కువగా కనిపించిన సమస్యలు D కేటగిరీకి చెందినవేనని తెలిపారు. ఇందులో సీట్లు,ట్రే టేబుళ్లు, సీట్ల వెనుక ఉన్న స్క్రీన్లు వంటి అంశాలు ఉంటాయని,ఇవి విమాన భద్రతకు సంబంధం లేని లోపాలేనని ఆయన చెప్పారు. ఇక ఎయిర్‌లైన్స్ తనిఖీలతో పాటు, గతేడాది డీజీసీఏ (DGCA) పర్యవేక్షణను మరింత పెంచిందని మంత్రి తెలిపారు. ప్రణాళిక ప్రకారం 3,890 సర్వైలెన్స్ తనిఖీలు, 56 రెగ్యులేటరీ ఆడిట్లు, విదేశీ విమానాలపై 84 SOFA చెక్లు, 492 ర్యాంప్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించినట్లు చెప్పారు.
వివరాలు
1,063కు పెంచిన సాంకేతిక పోస్టుల సంఖ్య
అదనంగా, అనూహ్య తనిఖీల్లో భాగంగా 874 స్పాట్ చెక్లు, 550 నైట్ ఇన్‌స్పెక్షన్లు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. డీజీసీఏలో సిబ్బంది ఈ అంశంపై మాట్లాడుతూ, 2022లో సాంకేతిక విభాగంలో 637 మంజూరైన పోస్టులు ఉన్నాయని చెప్పారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు పునర్వ్యవస్థీకరణ చేపట్టామని, ప్రస్తుతం సాంకేతిక పోస్టుల సంఖ్యను 1,063కు పెంచినట్లు మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.