AirTrunk: భారత్‌లో డేటా సెంటర్ల అభివృద్ధికి ఎయిర్‌ట్రంక్ భారీ పెట్టుబడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థలు బ్లాక్‌స్టోన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ మద్దతుతో పనిచేస్తున్న ఎయిర్‌ట్రంక్ సంస్థ భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోని డిజిటల్ మౌలిక వసతుల విస్తరణకు తోడ్పడే లక్ష్యంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో డేటా సెంటర్ల నిర్మాణం కోసం సుమారు 30 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి మొత్తం 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను అభివృద్ధి చేయడం సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
వివరాలు
పెట్టుబడి ప్రణాళికలు వెల్లడి..
ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) రాబిన్ ఖుదా భారత పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సమావేశం అనంతరం సంస్థ తన పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అత్యాధునిక రంగాల్లో ఇలాంటి పెట్టుబడులు భారత్‌ను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా ఎదగడానికి దోహదపడతాయని ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
వివరాలు
ఎయిర్‌ట్రంక్ కీలక ప్రకటన..
భారతదేశాన్ని ప్రపంచ ఏఐ శక్తికేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి ఎయిర్‌ట్రంక్ పెట్టుబడులు బలమైన మద్దతునిస్తాయని రాబిన్ ఖుదా తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ వెల్లడించింది. దేశ ఆర్థికాభివృద్ధికి రహదారులు, నౌకాశ్రయాలు, విద్యుత్ నెట్‌వర్క్‌లు ఎంత కీలకమో, అదే స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా ప్రస్తుత కాలంలో అవసరమని ఎయిర్‌ట్రంక్ తన ప్రకటనలో పేర్కొంది.