Page Loader
Amazon:క్విక్‌ కామర్స్‌లోకి అమెజాన్‌.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు
క్విక్‌ కామర్స్‌లోకి అమెజాన్‌.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు

Amazon:క్విక్‌ కామర్స్‌లోకి అమెజాన్‌.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్ కామర్స్ రంగానికి వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కావాల్సిన సరకులు కేవలం కొన్ని నిమిషాల్లో ఇంటి వద్దకే చేరుతున్నందున, చాలా మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ను గుర్తించిన దిగ్గజ కంపెనీలు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతానికి బెంగళూరులోనే ఈ సేవలను ప్రారంభించింది.

Details

'అమెజాన్‌ నౌ' ద్వారా 10 నిమిషాల్లో డెలివరీ! 

'అమెజాన్‌ నౌ' పేరుతో ఈ సేవలను బెంగళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఇతర నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు కంపెనీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. 1,000-2,000 ఉత్పత్తుల డెలివరీకి సిద్ధం క్విక్ కామర్స్ సేవలలో భాగంగా, 1,000-2,000 ఉత్పత్తుల డెలివరీ చేయడానికి అమెజాన్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కూరగాయలు, కిరాణా వస్తువులు, బ్యూటీ ఉత్పత్తులు, గృహోపకరణాలు తదితర నిత్యావసరాలను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేసేలా కంపెనీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ను కూడా చేపట్టినట్లు సమాచారం.

Details

పోటీకి సిద్ధమైన అమెజాన్‌ 

ప్రస్తుతం, బ్లింకిట్‌, స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలు క్విక్ కామర్స్ సేవలను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ 'మినిట్స్‌' పేరుతో గత ఆగస్టులో ఈ సేవలను ప్రారంభించగా, ఇప్పటికే 120-150 డార్క్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌ నాటికి ఈ సంఖ్యను 500-550కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెజాన్‌ తన క్విక్ కామర్స్ వ్యూహాన్ని మరింత విస్తరించే అవకాశముంది.