LOADING...
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,632 కోట్లు.. స్వల్ప వృద్ధి నమోదు
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,632 కోట్లు.. స్వల్ప వృద్ధి నమోదు

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,632 కోట్లు.. స్వల్ప వృద్ధి నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్ రూ.7,631.72కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.89% వృద్ధి చెందింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రుణాలపై వచ్చే ముప్పులకు ముందస్తుగా రూ.2,001 కోట్లు కేటాయించినట్లు బ్యాంక్ తెలిపింది. దీంతో మొత్తం కేటాయింపులు రూ.1,359 కోట్ల నుంచి రూ.3,522 కోట్లకు పెరిగాయి. స్టాండలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం స్వల్పంగా తగ్గింది. గతంలో రూ.7,117.50కోట్లుగా ఉన్న నికరలాభం, ప్రస్తుతం రూ.7,071.31 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (NII) 5%పెరిగి రూ.14,457 కోట్లకు పెరిగింది. రుణాల జారీ 19% వృద్ధి చెందడం దీనికి తోడ్పడింది.

వివరాలు

అదనపు మొత్తాలు తిరిగిరావడమే ఇందుకు కారణం

అయితే నికర వడ్డీ మార్జిన్ (NIM) 0.35% తగ్గి 3.62% వద్ద నిలిచింది. ఇతర ఆదాయం 4% తగ్గి రూ.6,023 కోట్లుగా నమోదైంది. పన్నుల రూపంలో ఒకసారి రూ.2,193 కోట్లు బ్యాంక్‌కు లాభంగా వచ్చినట్లు తెలిపింది. గతంలో కేటాయించిన అదనపు మొత్తాలు తిరిగి రావడం ఇందుకు కారణమని వివరించింది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పునీత్ శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు.

వివరాలు

ఆస్తుల నాణ్యత మెరుగుదల

ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరినా, రూపాయి విలువ 20% వరకు పడిపోయినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు సహాయపడతాయని చెప్పారు. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.4% నుంచి 1.23%కు తగ్గడం గమనార్హం. మరోవైపు, అనుబంధ సంస్థ యాక్సిస్ ఫైనాన్స్ ఇంకా రూ.లక్ష కోట్ల స్థాయికి చేరుకోకపోవడంతో అప్పర్ లెవల్ NBFCగా గుర్తింపు పొందలేదని తెలిపారు. బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 మార్చి చివరితో పోలిస్తే సిబ్బంది సంఖ్య సుమారు 3,000 మందికి తగ్గి 1.01 లక్షలకు చేరింది. డిజిటల్, టెక్నాలజీ ఆధారిత విధానాల విస్తరణ కారణంగానే ఈ మార్పు చోటుచేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement