Blackstone: భారత్‌లో 100 బిలియన్ డాలర్లు పెట్టనున్న బ్లాక్‌స్టోన్.. ఏ రంగాల్లో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్ (Blackstone) భారత్‌లో తన పెట్టుబడులను రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగిన ఈ సంస్థ.. వాటిని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని యోచిస్తోంది. రియల్ ఎస్టేట్,డిజిటల్ మౌలిక సదుపాయాలు,ఆర్థిక సేవలు,ఆరోగ్య సంరక్షణ,తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో ఆర్థిక వృద్ధి,మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరగడం,మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక రంగంలో అవకాశాలు తమ పెట్టుబడుల ప్రణాళికకు బలాన్నిస్తున్నాయని బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ జోన్ గ్రే తెలిపారు. CNBC-TV18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మార్కెట్లలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ భారత్‌పై తమకు దీర్ఘకాలిక నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
భారత్‌లో పెట్టుబడులకు ప్రభుత్వ విధానాలే కీలకం..
భారత్‌లో ఆర్థిక వృద్ధి కొనసాగడంతో పాటు, విదేశీ పెట్టుబడిదారులకు స్పష్టత, భరోసా కల్పించే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తే పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు వస్తాయని జోన్ గ్రే అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉన్న వ్యాపారాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, కానీ భారత్‌లో పెరుగుతున్న దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వ్యాపారాలను నిర్మించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అవసరమని వివరించారు.
ఇక్కడ పెట్టుబడిదారులు కేవలం వ్యాపారాలను కొనుగోలు చేయడమే కాకుండా, వాటిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
వివరాలు
రియల్ ఎస్టేట్ నుంచి ఏఐ వరకు..
భారత్‌లో బ్లాక్‌స్టోన్ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇప్పటికే లాజిస్టిక్స్, హోటళ్లు, షాపింగ్ సెంటర్లలో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని గ్రే తెలిపారు.
ఇదే సమయంలో కృత్రిమ మేధ (AI) రంగానికి సంబంధించిన డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్ సామర్థ్యాల అభివృద్ధిలోనూ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, ప్రయాణ రంగం, తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది.
బలమైన యాజమాన్య బృందాలు ఉన్న వ్యాపారాలను గుర్తించి, వాటి విస్తరణకు సహకరించడమే తమ పెట్టుబడుల వ్యూహమని ఆయన వివరించారు.
వివరాలు
భారత్ వృద్ధిపై బ్లాక్‌స్టోన్ భారీ నమ్మకం..
భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని బ్లాక్‌స్టోన్ భావిస్తోంది.
దేశ ఆర్థిక వృద్ధి అవకాశాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, సాంకేతిక సామర్థ్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తమకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని గ్రే చెప్పారు.
రాబోయే శతాబ్దం భారత్‌దే అవుతుందని భావిస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు.
ప్రస్తుతం భారత్‌లో తలసరి జీడీపీ సుమారు 3,000 డాలర్లుగా ఉందని, ఇది అమెరికా స్థాయిలో దాదాపు ముప్పైవ వంతు మాత్రమేనని గుర్తుచేశారు.
దీంతో భారత్‌లో భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
భారత్‌లోని మూలధన మార్కెట్లు కూడా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు కీలకమైన బలమని గ్రే పేర్కొన్నారు.
వివరాలు
భారత్ మూలధన మార్కెట్లపై బ్లాక్‌స్టోన్ నమ్మకం..
తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా పెట్టుబడులపై రాబడులను పొందేందుకు ఈ మార్కెట్లు సహకరిస్తాయని వివరించారు.
ఇప్పటివరకు భారత్‌లో బ్లాక్‌స్టోన్ 14కంపెనీల ఐపీఓలను పూర్తి చేసిందని తెలిపారు.
దేశంలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన ఆరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో(REITs)ఐదింటికి తమ సంస్థ మద్దతు ఇచ్చిందని వెల్లడించారు.
భారత మూలధన మార్కెట్ల విలువ, వాటి సామర్థ్యాన్ని దేశ ప్రజలు పూర్తిగా గుర్తించకపోవచ్చని, ఇవి భారత్‌కు ఎంతో విలువైన ఆస్తిగా మారాయని అన్నారు.
మొత్తంగా, భారత్‌లో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచాలన్న బ్లాక్‌స్టోన్ ప్రణాళిక.. దేశ ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాలపై సంస్థకున్న దీర్ఘకాలిక అంచనాలను ప్రతిబింబిస్తోంది.