Loading...
Blinkit: అత్యవసరం కాని ప్రయాణాలకు బ్లింకిట్‌ అంబులెన్స్‌ ఛార్జీ.. రూ.2,500
అత్యవసరం కాని ప్రయాణాలకు బ్లింకిట్‌ అంబులెన్స్‌ ఛార్జీ.. రూ.2,500

Blinkit: అత్యవసరం కాని ప్రయాణాలకు బ్లింకిట్‌ అంబులెన్స్‌ ఛార్జీ.. రూ.2,500

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ తన అంబులెన్స్‌ సేవల్లో కీలక మార్పులు చేసింది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అందించే సేవలను ఉచితంగానే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అయితే,అత్యవసరం కాని ప్రయాణాలకు ఇకపై రూ.2,500 ఫ్లాట్‌ ఫీజు వసూలు చేయనుంది. అంబులెన్స్‌లు సాధారణ అవసరాలకు కాకుండా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ గురువారం ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. వైద్యుల సంప్రదింపులు,సాధారణ వైద్య పరీక్షలు, ఆసుపత్రికి వెళ్లడం,చికిత్స అనంతరం ఇంటికి తిరిగి రావడం వంటి అవసరాల కోసం కూడా అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రయాణాలకు సాధారణ వాహనాలు లేదా ప్రైవేటు రవాణా సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు.

వివరాలు 

రెండేళ్లలో 42 వేల కేసులకు సేవలు

గత రెండేళ్లలో బ్లింకిట్‌ అంబులెన్స్‌ సేవలు మొత్తం 42 వేల కేసులకు స్పందించాయని గోయల్‌ వెల్లడించారు.

వీటిలో దాదాపు 20 వేల కేసులు అత్యవసర వైద్య సేవలకు సంబంధించినవని వివరించారు.

ఇప్పటివరకు ఏ ఒక్కరి నుంచీ అంబులెన్స్‌ సేవలకు ఛార్జీలు వసూలు చేయలేదని, భవిష్యత్తులోనూ అత్యవసర సేవలను ఉచితంగానే అందిస్తామని స్పష్టం చేశారు.

అయితే, అన్ని రకాల ప్రయాణాలకు ఉచిత సేవలు అందుబాటులో ఉండటంతో సాధారణ అవసరాల కోసం అంబులెన్స్‌ బుకింగ్‌లు పెరుగుతున్నట్లు సంస్థ గుర్తించింది.

ఇలాంటి బుకింగ్‌ల కారణంగా వైద్య సిబ్బంది, అత్యవసర పరికరాలతో సిద్ధంగా ఉండే అంబులెన్స్‌లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందుబాటులో ఉండటం లేదని గోయల్‌ తెలిపారు.

వివరాలు 

అత్యవసర వైద్య పరిస్థితుల్లో రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

కొత్త నిబంధనల ప్రకారం అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

అత్యవసరం కాని ప్రయాణాలకు మాత్రం సేవ పూర్తయిన తర్వాత రూ.2,500 చెల్లించాలి.

ప్రైవేటు అంబులెన్స్‌లు వసూలు చేసే ఛార్జీలకు దగ్గరగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు గోయల్‌ వివరించారు.

ఈ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎటర్నల్‌ ఫౌండేషన్‌కు అందజేసి, అంబులెన్స్‌ సేవల విస్తరణకు వినియోగించనున్నట్లు తెలిపారు.

పది నిమిషాల్లో అంబులెన్స్‌ అందించే సేవలు వేలాది ప్రాణాలను కాపాడగలవని గోయల్‌ పేర్కొన్నారు.

అందువల్ల ఈ సేవలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ADVERTISEMENT