KC-390: భారత్‌లోనే కేసీ-390 మిలీనియం తయారీకి ఎంబ్రాయెర్ సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌కు చెందిన విమాన తయారీ దిగ్గజం ఎంబ్రాయెర్(Embraer)భారత్‌లోనే కేసీ-390 మిలీనియం రవాణా విమానాల తయారీ చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈఓ ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆదివారం వెల్లడించారు. భారత్‌లో తయారయ్యే విమానాలను ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాలకు ఎగుమతి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత వైమానిక దళం నుంచి ఈ రకం రవాణా అవసరాల కోసం 80విమానాల ఆర్డర్ లభిస్తే,ఉత్పత్తి కేంద్రాన్ని భారత్‌లోనే నెలకొల్పుతామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తక్కువ పొడవున్న రన్‌వేల నుంచి సులభంగా ఎగిరిపోగల సామర్థ్యం,వేగంగా సైనిక దళాలు,ఆయుధ సామగ్రిని తరలించే ప్రత్యేకతలతో కేసీ-390మిలీనియం విమానాలు ప్రసిద్ధి చెందాయి.
వివరాలు
గగనతలంలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం
అంతేకాకుండా,గగనతలంలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం కూడా వీటిలో ఉంది. ఇవే విమానాలకు సంబంధించి మరమ్మతులు,నిర్వహణ,ఓవర్‌హాల్ సేవలు అందించే ఎంఆర్‌ఓ కేంద్రాన్ని కూడా భారత్‌లో ఏర్పాటు చేయాలని ఎంబ్రాయెర్ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే నాటో కూటమికి చెందిన స్వీడన్, నెదర్లాండ్స్, పోర్చుగల్ దేశాలు ఈ విమానాలను కొనుగోలు చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏఎన్-32, ఐఎల్-76 రవాణా విమానాలకు బదులుగా 80 మధ్యస్థ రవాణా విమానాలను సమకూర్చుకోవాలనే యోచనలో భారత వైమానిక దళం ఉంది. ఈ భారీ ఒప్పందం కోసం కేసీ-390 మిలీనియంతో పాటు Airbus Defence and Space తయారు చేసే ఎ-400ఎం, అలాగే లాక్‌హీడ్ మార్జిన్ సంస్థకు చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ విమానాలు కూడా పోటీలో నిలిచాయి.