Loading...
Gold Hallmark: బంగారం కొంటున్నారా? నకిలీ హాల్‌మార్క్‌తో మోసం చేసే ప్రమాదం.. ఇలా చెక్‌ చేయండి!
బంగారం కొంటున్నారా? నకిలీ హాల్‌మార్క్‌తో మోసం చేసే ప్రమాదం.. ఇలా చెక్‌ చేయండి!

Gold Hallmark: బంగారం కొంటున్నారా? నకిలీ హాల్‌మార్క్‌తో మోసం చేసే ప్రమాదం.. ఇలా చెక్‌ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేసిన తర్వాత దాని స్వచ్ఛతను నిర్ధారించుకోవడానికి హాల్‌మార్కింగ్‌ చిహ్నాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఆభరణంపై హాల్‌మార్క్‌ ఉంది కదా అని దానిని మొబైల్‌ యాప్‌లో తనిఖీ చేయకుండా కొనుగోలు చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ హాల్‌మార్క్‌ స్టాంపులతో అక్రమార్కులు వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒక్కో బంగారు ఆభరణానికి హాల్‌మార్కింగ్‌ ధ్రువీకరణ ఇచ్చేందుకు వసూలు చేసే ఛార్జీని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) రూ.45 నుంచి రూ.75కు పెంచింది. అయితే వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

వివరాలు

వినియోగదారులను మోసం చేసే ప్రమాదం

వెండి ఆభరణానికి ప్రస్తుతం రూ.35గానే ఛార్జీ వసూలు చేస్తున్నారు.

బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీ పెరగడంతో స్వచ్ఛత ధ్రువీకరణ కోసం అస్సేయింగ్‌/హాల్‌మార్కింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా కొందరు అక్రమార్కులు, వ్యాపారులు నకిలీ హాల్‌మార్కింగ్‌ స్టాంపులను తయారు చేసి వినియోగదారులను మోసం చేసే ప్రమాదం ఉందని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) హెచ్చరిస్తోంది.

ప్రతి ఆభరణంపై ముద్రించే హాల్‌మార్క్‌ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (హెచ్‌యూఐడీ) గురించి కొనుగోలుదారులకు తగిన అవగాహన లేకపోవడం కూడా అక్రమార్కులకు అనుకూలంగా మారుతోందని తెలిపింది.

వివరాలు

మొబైల్‌లోనే పరిశీలించుకోవాలి

దేశంలోని దాదాపు 800 జిల్లాల్లో కేవలం 10 శాతం ప్రాంతాల్లోని వినియోగదారులకు మాత్రమే హాల్‌మార్కింగ్‌, బీఐఎస్‌ కేర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా హాల్‌మార్క్‌ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (హెచ్‌యూఐడీ)ను తనిఖీ చేసుకునే విధానంపై అవగాహన ఉందని జీజేసీ ఛైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు.

ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు హెచ్‌యూఐడీపై అవగాహన తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు అసలైన హాల్‌మార్క్‌ ఫొటోగ్రాఫ్‌లను, నకిలీ స్టాంపులను సులభంగా కాపీ చేసి.. నకిలీ బంగారాన్ని 'హాల్‌మార్కింగ్‌ స్వచ్ఛత' పేరుతో వినియోగదారులకు విక్రయించే ప్రమాదం ఉందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

పరిశ్రమపై రూ.480 కోట్ల అదనపు భారం

దేశంలో హాల్‌మార్కింగ్‌ కేంద్రాల (ఏహెచ్‌సీలు) సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2022 జులైలో దేశవ్యాప్తంగా 1,220 హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు ఉండగా.. 2026 జులై నాటికి వాటి సంఖ్య 1,577కు చేరింది.

ఇప్పటివరకు హెచ్‌యూఐడీతో కూడిన హాల్‌మార్క్‌ ముద్రించిన మొత్తం ఆభరణాల సంఖ్య 65 కోట్లను దాటింది.

ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 13.22 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ చేశారు. ఇక హాల్‌మార్కింగ్‌ ముద్రణ ఛార్జీలను తాజాగా పెంచడంతో పరిశ్రమపై ఏడాదికి దాదాపు రూ.400 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని జీజేసీ అంచనా వేస్తోంది.

దీనికి అదనంగా సుమారు రూ.80 కోట్ల జీఎస్‌టీ భారం కూడా ఉంటుందని పేర్కొంది. మొత్తంగా పరిశ్రమపై దాదాపు రూ.480 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

పెరిగిన సమయం.. వర్కింగ్‌ క్యాపిటల్‌పై ప్రభావం

ఈ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారుల రక్షణకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని జీజేసీ పేర్కొంది.

అందువల్ల బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు గతంలో ఉన్న రూ.45 ఛార్జీనే పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీఐఎస్‌కు జీజేసీ వినతిపత్రం సమర్పించింది.

ఆభరణాలకు తప్పనిసరి ఫొటోగ్రఫీ వంటి అదనపు నిబంధనలు అమల్లోకి రావడంతో హాల్‌మార్కింగ్‌ ప్రక్రియకు పట్టే సమయం కూడా పెరిగిందని జీజేసీ తెలిపింది.

గతంలో హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ కేవలం 6 గంటల్లో పూర్తయ్యేదని.. ప్రస్తుతం 24 నుంచి 36 గంటల సమయం పడుతోందని పేర్కొంది.

హాల్‌మార్కింగ్‌ కోసం ఆభరణాలు ఎక్కువ సమయం నిలిచిపోవడంతో వ్యాపారుల వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా ఎక్కువ కాలం బ్లాక్‌ అవుతోందని మండలి తెలిపింది.

వివరాలు

హాల్‌మార్కింగ్‌ను ఇలా తనిఖీ చేసుకోండి

దీనివల్ల వారి ఫైనాన్సింగ్‌ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని వివరించింది. బీఐఎస్‌ నిబంధనల ప్రకారం అసలైన హాల్‌మార్క్‌ ఉన్న ఆభరణంపై మూడు గుర్తులు తప్పనిసరిగా ఉండాలి.

మొదటిది బీఐఎస్‌ లోగో, రెండోది ఆభరణం స్వచ్ఛత గ్రేడ్‌.. అంటే 22 లేదా 18 క్యారెట్లు, మూడోది ఆరు అంకెలు, అక్షరాలతో కూడిన హెచ్‌యూఐడీ కోడ్‌.

ఈ వివరాలను తనిఖీ చేసుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లో 'బీఐఎస్‌ కేర్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో హెచ్‌యూఐడీ ఆప్షన్‌ను ఎంచుకుని, కొనుగోలు చేయాలనుకుంటున్న ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ కోడ్‌ను నమోదు చేయాలి.

కోడ్‌ను నమోదు చేసిన తర్వాత ఆ ఆభరణం సరైన ధ్రువీకరణ పొందిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు.

వివరాలు

క్షణాల్లో తెలుసుకొనే అవకాశం

హాల్‌మార్క్‌ ధ్రువీకరణ సరిగ్గా ఉంటే ఆ ఆభరణంలోని బంగారం స్వచ్ఛత, హాల్‌మార్క్‌ చేసిన తేదీ, హాల్‌మార్కింగ్‌ నిర్వహించిన కేంద్రానికి సంబంధించిన వివరాలు క్షణాల్లో యాప్‌లో కనిపిస్తాయి.

అందువల్ల బంగారు ఆభరణం కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్‌ ఉండటంతో పాటు హెచ్‌యూఐడీని బీఐఎస్‌ కేర్‌ యాప్‌లో తనిఖీ చేసుకోవడం ద్వారా నకిలీ హాల్‌మార్క్‌ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.

ADVERTISEMENT