Byju's : 22బిలియన్ డాలర్ల నుంచి అమాంతం పతనమైన బైజూస్.. ఎంతో తెలుసా
ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఇంకా కష్టాలతోనే కొట్టుమిట్టాడుతోంది. బైజూస్, నగదు నిల్వల సమస్యలతో ఎదురీతుతోంది. ఈ మేరకు $1.2 బిలియన్ల రుణంపై రుణదాతలతో వివాదంలో చిక్కుకుంది. ఇది బైజూస్ సంస్థకు మరో దెబ్బగా నిలుస్తోంది. ప్రముఖ టెక్ ఇన్వెస్టర్ ప్రోసస్. ఎడ్'టెక్ స్టార్టప్ బైజూస్ విలువను 22 బిలియన్ డాలర్ల నుంచి అమాంతం 3 బిలియన్ల కంటే తక్కువకు తగ్గించింది. ఇది గత సంవత్సరం గరిష్టం 22 బిలియన్ డాలర్ల కంటే 86 శాతం తక్కువ కావడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి సమయంలో వేగవంతమైన విస్తరణ తర్వాత, బైజూస్ నగదు ప్రవాహ సమస్యలతో ఆర్థికంగా కుదేలైంది. మరోవైపు $1.2 బిలియన్ల రుణంపై రుణదాతలతో బైజూస్ వివాదంలో చిక్కుకుంది.
వాల్యుయేషన్ కోతకు కారణాన్ని వెల్లడించని ప్రాసస్
గత సంవత్సరంలో, Prosus, Blackrockతో సహా వాటాదారులు వరుసగా మార్చిలో $11 బిలియన్లకు, మేలో $8 బిలియన్లకు, జూన్లో $5 బిలియన్లకు బైజూ విలువను తగ్గిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి తగ్గించగా 3 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఇదే సమయంలో బైజూస్ తన 2021/22 ఆర్థిక ఫలితాలను దాఖలు చేయడంలో దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం చేసింది. దీంతో ఆడిటర్ డెలాయిట్ సహా ముగ్గురు బోర్డు సభ్యులు సంస్థ నుంచి నిష్క్రమించారు. అంతేకాకుండా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కూడా గత వారమే నిష్క్రమించారు.$1.2 బిలియన్ల రుణ చెల్లింపుల్లో ఉల్లంఘనల తర్వాత రుణ దాతలు ఈ ఏడాది బైజూస్‌పై దావా వేశారు.ప్రాసస్ వాల్యుయేషన్ కోతకు కారణాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.