ATM Charges Hike: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీలు పెంపు.. ఫ్రీ లిమిట్ తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు సంబంధించి ఏటీఎం ఛార్జీల్లో కీలక మార్పులు చేసింది. ఏటీఎంల ద్వారా చేసే లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను పెంచడంతో పాటు, ప్రతి నెలా ఉచితంగా చేసుకునే ఏటీఎం లావాదేవీల పరిమితిని కూడా తగ్గించింది. అంతేకాకుండా ఖాతాలో తగినంత నగదు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించి లావాదేవీ విఫలమైతే అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సవరించిన ఈ కొత్త ఛార్జీలు, నిబంధనలు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇకపై ఏటీఎం వినియోగించే కస్టమర్లు ఉచిత లావాదేవీల పరిమితిని దాటకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
వివరాలు
కెనరా బ్యాంక్ ఏటీఎంలలో ఫ్రీ ట్రాన్సాక్షన్లు తగ్గింపు
ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలలో ఖాతాదారులు నెలకు 6 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండేది.
తాజాగా ఈ పరిమితిని 5 లావాదేవీలకు తగ్గించారు. ఈ పరిమితి కేవలం నగదు ఉపసంహరణకే కాకుండా ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.
అంటే ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడం వంటి సేవలను వినియోగించినా అవి లావాదేవీలుగానే పరిగణిస్తారు.
నెలకు అందుబాటులో ఉన్న ఉచిత లావాదేవీలను పూర్తిగా వినియోగించిన తర్వాత చేసే ట్రాన్సాక్షన్లకు నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి.
వివరాలు
బ్యాలెన్స్ లేకపోతే మరింత భారం
ఏటీఎం నుంచి నగదు తీసుకునే సమయంలో సేవింగ్స్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోవడంతో లావాదేవీ విఫలమైతే కూడా ఛార్జీ విధించనున్నారు.
ముఖ్యంగా నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని దాటిన తర్వాత ఇలాంటి విఫలమైన ట్రాన్సాక్షన్ జరిగితే గతంలో రూ.17తో పాటు జీఎస్టీ వసూలు చేసేవారు.
ఇప్పుడు ఈ ఛార్జీని రూ.23కు పెంచారు. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
నగదు విత్‌డ్రాపై కూడా ఛార్జీ పెంపు
నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఏటీఎం ద్వారా నగదు తీసుకుంటే ఒక్కో లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
ఇందులో ICCW,UPI క్యాష్ విత్‌డ్రాయల్ వంటి నగదు ఉపసంహరణ లావాదేవీలు కూడా ఉన్నాయి.
ఇప్పటివరకు ఇలాంటి లావాదేవీలకు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.20ఛార్జీ ఉండేది. తాజాగా దీనిని రూ.23కు పెంచారు.
సీనియర్ సిటిజన్లకు మాత్రం ఊరట
ఏటీఎం ఛార్జీల విషయంలో సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ కొంత ఉపశమనం కల్పించింది. వీరికి నెలకు లభించే ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు.
సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు.ఈ పరిమితి పూర్తయిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.5తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
గ్రీన్ పిన్ ఛార్జీలో భారీ తగ్గింపు
మరోవైపు కెనరా బ్యాంక్ Classic, Standard,Platinum,Business,Select,World కార్డుల కోసం Green PIN జనరేట్ చేసుకునే విషయంలో ఛార్జీని భారీగా తగ్గించింది.
ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత గ్రీన్ పిన్ జనరేట్ చేసేందుకు ప్రయత్నిస్తే గతంలో రూ.23ఛార్జీ ఉండేది.ఇప్పుడు దానిని కేవలం రూ.5కు తగ్గించారు.
మెట్రో నగరాల్లో 5..ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 3 ఉచితం
కెనరా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితి ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది.
మెట్రో నగరాల్లో కెనరా బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించే ఖాతాదారులు నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే నెలకు 3 ఉచిత లావాదేవీల వరకు అవకాశం ఉంటుంది. ఈ పరిమితి దాటిన తర్వాత బ్యాంకు నిర్ణయించిన ఛార్జీలు వర్తిస్తాయి.