RBI Money Transfer Rules 2026: బ్యాంకు ఖాతా లేకున్నా డబ్బు పంపొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు కూడా ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశం ఉంది. అయితే ఎంత మొత్తం పంపవచ్చు? ఏటీఎంలు, బ్యాంకు ప్రతినిధుల ద్వారా నగదు బదిలీ చేస్తే పరిమితులు ఏమిటి? ఈ అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో అమల్లో ఉన్న నగదు బదిలీ పరిమితులను కొనసాగిస్తూనే.. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు అదనపు భద్రతా చర్యలను తప్పనిసరి చేసింది.
వివరాలు
బ్యాంకు శాఖ ద్వారా రూ.50 వేల వరకు..
బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు కూడా నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి నగదు రూపంలో ఇతరుల ఖాతాల్లోకి డబ్బు పంపవచ్చు.
ఇందుకోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సేవను ఉపయోగించుకోవచ్చు.
ఈ విధానంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.50 వేల వరకు నగదు బదిలీ చేయవచ్చు. గతంలో ఉన్న ఈ పరిమితినే ఆర్బీఐ కొనసాగించింది.
ఏటీఎంలు, బ్యాంకు ప్రతినిధుల ద్వారా ఎంతంటే?
బ్యాంకు ఖాతా లేని వారు బిజినెస్ కరస్పాండెంట్లు, ఏటీఎంలు లేదా బ్యాంకులు అనుమతించిన ఇతర మార్గాల ద్వారా కూడా నగదు పంపవచ్చు.
బిజినెస్ కరస్పాండెంట్లు అంటే బ్యాంకుల తరఫున గ్రామీణ, ఇతర ప్రాంతాల్లో సేవలందించే ప్రతినిధులు.
వివరాలు
డబ్బు తీసుకునే వ్యక్తికి ఖాతా లేకపోతే..
అయితే ఈ మార్గాల్లో ఒక్కో లావాదేవీ ద్వారా గరిష్ఠంగా రూ.5 వేలు మాత్రమే పంపేందుకు అనుమతి ఉంది. ఒక వ్యక్తి నెల మొత్తం మీద పంపే నగదు రూ.25 వేలకు మించకూడదు.
డబ్బు పంపే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండి, నగదు స్వీకరించే వ్యక్తికి ఖాతా లేకపోయినా బదిలీ చేసేందుకు అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో ఏటీఎంలు, బ్యాంకు ప్రతినిధులు లేదా ఇతర అనుమతించిన మార్గాల ద్వారా నగదును అందించవచ్చు.
అయితే ఒక్కోసారి గరిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే పంపాలి. ఒక వ్యక్తికి నెల వ్యవధిలో ఇలా అందించే మొత్తం రూ.25 వేలకు మించకూడదు.
వివరాలు
మోసాలను అరికట్టేందుకు భద్రతా చర్యలు
నగదు బదిలీల్లో మోసాలకు తావులేకుండా ఆర్బీఐ పలు భద్రతా నిబంధనలను విధించింది.
డబ్బు పంపే వ్యక్తి మొబైల్ నంబర్‌ను బ్యాంకు తప్పనిసరిగా ధ్రువీకరించాలి.
కేవైసీ నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తి గుర్తింపు పత్రాల వివరాలను కూడా నమోదు చేయాలి.
నగదు రూపంలో జరిగే బదిలీలను గుర్తించేందుకు నెఫ్ట్ (NEFT), ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల వివరాల్లో ప్రత్యేక గుర్తింపు సంకేతాన్ని పొందుపరచాలి.
అలాగే డబ్బు పంపిన వ్యక్తికి సంబంధించిన వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా భద్రపరచాలి.
వివరాలు
అనుమానాస్పద లావాదేవీలపై నిఘా
ఏదైనా బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు జమ అవుతున్నా, అనుమానాస్పద లావాదేవీలు చోటుచేసుకుంటున్నా బ్యాంకులు వెంటనే వాటిని పరిశీలించాలి.
లావాదేవీలపై అనుమానం బలపడితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నగదు బదిలీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి.
అలాగే బ్యాంకుల మధ్య జరిగే నగదు లావాదేవీలన్నీ ఆర్బీఐ ఆమోదించిన వ్యవస్థల ద్వారానే నిర్వహించాలి.
వివరాలు
ఎవరెవరికి ఈ నిబంధనలు వర్తిస్తాయి?
ఆర్బీఐ జారీ చేసిన ఈ మార్గదర్శకాలు దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతోపాటు సంబంధిత చెల్లింపు సేవల సంస్థలకు వర్తిస్తాయి.
అయితే ఒక కార్డు నుంచి మరో కార్డుకు చేసే నగదు బదిలీలు మాత్రం ఈ నిబంధనల పరిధిలోకి రావు.