Lalithaa Jewellery Mart IPO: లలితా జువెల్లరీ ఐపీఓకు ముహూర్తం ఖరారు.. రూ.1700 కోట్ల సమీకరణకు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే మాటతో గుర్తింపు తెచ్చుకున్న లలితా జువెల్లరీ అధినేత ఎం. కిరణ్ కుమార్ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నారు. ఆయన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న లలితా జువెల్లరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. చెన్నై కేంద్రంగా జువెల్లరీ వ్యాపారం నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇష్యూ తేదీలు, షేరు ధరల శ్రేణిని సంస్థ ఖరారు చేసింది. లలితా జువెల్లరీ మార్ట్ మెయిన్‌బోర్డ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. అనంతరం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.
వివరాలు
షేరు ధర రూ.190 నుంచి రూ.201
ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.190 నుంచి రూ.201 వరకు ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది.
ఈ పబ్లిక్ ఇష్యూలో ఫ్రెష్ షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉండనుంది.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.1,200 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు ప్రమోటర్ ఎం. కిరణ్ కుమార్ తన వాటాలో కొంత భాగాన్ని OFS ద్వారా విక్రయించి రూ.500 కోట్లు సమీకరించనున్నారు.
ఈ రెండు మార్గాల్లో కలిపి లలితా జువెల్లరీ మార్ట్ మొత్తం రూ.1,700 కోట్ల నిధులను సమీకరించనుంది.
వివరాలు
ఆగస్టు 14న యాంకర్ బుక్ బిడ్డింగ్
పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందు రోజు అంటే ఆగస్టు 14న యాంకర్ బుక్ బిడ్డింగ్ ప్రారంభం కానుంది.
ఇందులో దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత మదుపరులు కంపెనీ షేర్ల కోసం బిడ్లు దాఖలు చేయవచ్చు.
ఆగస్టు 17 నుంచి 19 వరకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఆగస్టు 20న షేర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
అనంతరం ఆగస్టు 24న సోమవారం స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు డిస్కౌంట్‌తో షేర్లు
లలితా జువెల్లరీ మార్ట్ తన ఉద్యోగుల కోసం కూడా షేర్లను కేటాయించింది.
ఇందుకోసం రూ.6కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసింది. ఉద్యోగులకు ఫైనల్ ఇష్యూ ధరపై గరిష్ఠంగా 10శాతం వరకు డిస్కౌంట్‌తో ఈ షేర్లను అందించనుంది.
వివరాలు
కనీస పెట్టుబడి రూ.14,874
ఐపీఓలో ఒక్కో లాట్‌లో 74 షేర్లు ఉంటాయి.
ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర అయిన రూ.201ను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక లాట్ కొనుగోలు చేయడానికి రూ.14,874 పెట్టుబడి అవసరం అవుతుంది.
అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఈ మొత్తంతో ఐపీఓలో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ పబ్లిక్ ఇష్యూకు ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఎక్వైరస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. MUFG రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వహిస్తోంది.
వివరాలు
1985లో తొలి షోరూమ్
లలితా జువెల్లరీ మార్ట్ వ్యాపార ప్రస్థానం 1985లో ప్రారంభమైంది. చెన్నైలోని టి.నగర్‌లో సంస్థ తన తొలి స్టోర్‌ను ప్రారంభించింది.
అనంతరం దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి కంపెనీకి దాదాపు 63 షోరూమ్‌లు ఉన్నాయి.
విజయవాడలోని లలితా జువెల్లరీ షోరూమ్ దేశంలోని అతిపెద్ద జువెల్లరీ స్టోర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
వివరాలు
బంగారం, వెండి, వజ్రాభరణాల విక్రయం
కంపెనీ ప్రధానంగా బంగారం, వెండి, డైమండ్ జువెల్లరీని విక్రయిస్తోంది.
ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో లలితా జువెల్లరీకి గణనీయమైన ఉనికి ఉంది. ఈ కేటగిరీ నగరాల్లోనే కంపెనీకి మొత్తం 45 స్టోర్లు ఉన్నాయి.
సంస్థ మొత్తం ఆదాయంలో ఈ 45 స్టోర్ల వాటా 60 శాతానికి పైగా ఉండటం మరో ముఖ్యమైన అంశం.
దక్షిణ భారత మార్కెట్‌లో విస్తృతమైన షోరూమ్ నెట్‌వర్క్‌తో కొనసాగుతున్న లలితా జువెల్లరీ మార్ట్ ఇప్పుడు ఐపీఓ ద్వారా మూలధనాన్ని సమీకరించేందుకు సిద్ధమైంది.