World Under-20 Athletics: అంచనాలు అందుకోలేకపోయిన పూజ.. హైజంప్‌లో నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సోమవారం జరిగిన మహిళల హైజంప్ ఫైనల్లో భారత యువ అథ్లెట్ పూజ సింగ్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 19 ఏళ్ల పూజ తన అత్యుత్తమ ప్రదర్శనగా 1.84 మీటర్ల ఎత్తును అధిగమించింది. ఈ ఏడాది మేలో జరిగిన ఆసియా అండర్-20 అథ్లెటిక్స్‌లో పూజ సింగ్ 1.93 మీటర్లు ఎగిరి జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అండర్-20 పోటీల్లో మాత్రం ఆమె ఆ స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. 1.87 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు చేసిన మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది.
వివరాలు
మహిళల 4×400 మీటర్ల రిలేలోనూ భారత్‌కు నిరాశే
హైజంప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఇజోబెల్ లూయ్‌సన్ 1.92 మీటర్లతో స్వర్ణ పతకం సాధించింది. హంగేరికి చెందిన లియానా బటోరి, స్పెయిన్ అథ్లెట్ ఐటానా అలోన్సో 1.90 మీటర్లతో వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
మహిళల 4×400 మీటర్ల రిలేలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది.
భూమిక నెహాతె, తహురా ఖాతున్, తను చౌదరి, థియ అరుముగమ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 45.28 సెకన్లలో రేసును పూర్తి చేసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అమెరికా జట్టు 3:29.15 నిమిషాలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది.
ఆస్ట్రేలియా 3:31.39 నిమిషాలతో రజతం, గ్రేట్ బ్రిటన్ 3:32.08 నిమిషాలతో కాంస్యం గెలుచుకున్నాయి.
వివరాలు
మూడు పతకాలతో ముగిసిన పోటీ
ఈ టోర్నీలో భారత్ మొత్తంగా మూడు పతకాలతో పోటీని ముగించింది.
జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం సాధించగా.. హైజంప్‌లో బసంత్ కుమార్ రజతం, లాంగ్‌జంప్‌లో షానవాజ్ కాంస్య పతకం గెలుచుకున్నారు.
మొత్తం మూడు పతకాలే వచ్చినప్పటికీ భారత అథ్లెటిక్స్‌కు ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే.
2002 నుంచి 2018 వరకు జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ మొత్తంగా నాలుగు పతకాలే సాధించింది. అలాంటిది ఈ ఒక్క టోర్నీలోనే మూడు మెడల్స్ దక్కడం విశేషంగా నిలిచింది.