Peddagadda Reservoir: కాలువలకు స్వస్తి.. భూగర్భ పైపులతో పెద్దగడ్డ ఆయకట్టుకు సాగునీటి సరఫరా
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్ (మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఇకపై కాలువల ద్వారా కాకుండా భూగర్భ పైపుల వ్యవస్థతో ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. తొలిదశలో పార్వతీపురం మన్యం జిల్లాలో 1,843హెక్టార్లు,విజయనగరం జిల్లాలో 1,218 హెక్టార్ల భూమికి ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగునీటి వృథాను తగ్గించడంతోపాటు సన్న,చిన్నకారు రైతులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఎం-కాడ్వామ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అమలుకు కేంద్రం రూ.1,600 కోట్లను కేటాయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నాయి.
వివరాలు
పనుల అప్పగింతకు సిద్ధం
పెద్దగడ్డ ప్రాజెక్టులోని 3, 4, 5, 6 నీటి వినియోగదారుల సంఘాల క్లస్టర్ల పరిధిలో తొలిదశ ఎం-కాడ్వామ్ పనులను చేపట్టనున్నారు.
ఇందుకోసం రూ.56.10కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచారు.
మొత్తం ఐదుసార్లు టెండర్లు ఆహ్వానించిన అనంతరం ఒక ఏజెన్సీ మాత్రమే బిడ్లు దాఖలు చేసింది.
ఆ ఏజెన్సీ అంచనా ధర కంటే 14.88శాతం అధిక మొత్తానికి టెండర్ దాఖలు చేసింది.
ఐదు శాతానికి మించి అధిక ధరకు టెండర్ రావడంతో మొత్తం రూ.64.45కోట్లతో పనులు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
దీంతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
వివరాలు
రైతుల భాగస్వామ్యం
ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నందున,పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అంశాన్ని సమగ్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టు అమలు తర్వాత వచ్చే ఫలితాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
ఎం-కాడ్వామ్ ప్రాజెక్టులో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు.
ఆయకట్టు పరిధిలోని పొలాల్లో నేలలో ఎంత తేమ ఉందో ఎప్పటికప్పుడు గుర్తించడంతోపాటు పంటకు ఎంతమేర నీటి తడులు అవసరమో అంచనా వేస్తారు.
ఈ వివరాలను నిరంతరం అందుబాటులో ఉంచేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. స్కడా (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), ఐఓటీ టూల్స్ ద్వారా సాగునీటి సరఫరా, వినియోగాన్ని పర్యవేక్షించనున్నారు.
వివరాలు
రైతుల భాగస్వామ్యం
పెద్దగడ్డ కుడి కాలువ పరిధిలోని క్లస్టర్లలో ఇప్పటికే సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు.
ఎం-కాడ్వామ్ పనులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించనున్నారు.
తద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యం మరింత పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎం-కాడ్వామ్ ప్రాజెక్టు కోసం రూ.20 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
దేశంలోని ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఒప్పందాలు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో ఎనిమిదో రాష్ట్రంగా నిలిచింది. పెద్దగడ్డ ప్రాజెక్టుకు ఎం-కాడ్వామ్ అమలులో మహన వెంచర్స్ సాంకేతిక సహకారం అందిస్తోంది.