Amaravati: అమరావతిలో కీలక ప్రాజెక్టులు రెడీ.. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ టవర్లకు తుది మెరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్ టవర్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనుండటంతో పనులకు శరవేగంగా తుది మెరుగులు దిద్దుతున్నారు. రాజధానిలోని ప్రధాన రహదారులు, పరిపాలన నగరంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల ప్రాజెక్టుల్లో తొలుత సిద్ధమైన వాటిలో ఇవి ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును విజయవాడ-మంగళగిరి రహదారితో అనుసంధానించేందుకు బకింగ్‌హాం కెనాల్, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తొలుత ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్ టవర్ల వద్దకు చేరుకుంటారు.
వివరాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 207 ఫ్లాట్లు
అమరావతిలో ఎమ్మెల్యేల కోసం ఆరు, ఎమ్మెల్సీల కోసం మూడు అపార్ట్‌మెంట్ టవర్లను నిర్మించారు. మొత్తం తొమ్మిది టవర్లలో 207 ఫ్లాట్లు ఉన్నాయి.
వీటి తాళాలను సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నారు.
ఈ నెల 17 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ ఫ్లాట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
18.270 కి.మీ మేర సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి
రాజధానిలో దొండపాడు నుంచి విజయవాడ-మంగళగిరి రోడ్డు వరకు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రస్తుతం 18.270 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు.
భవిష్యత్తులో ఈ రహదారిని మణిపాల్ ఆస్పత్రి వరకు విస్తరించనున్నారు.
అమరావతి రాజధానిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు నిర్మిస్తున్న ప్రతి ప్రధాన రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును తొమ్మిది వరుసల రహదారిగా నిర్మించారు.
దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా అనుసంధానం మరింత మెరుగుపడనుంది.