ICC: 'ఇది అవమానించడమే'.. ఐసీసీపై స్కాట్లాండ్, నెదర్లాండ్స్ అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో మార్పులు చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)పై స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ రెండు బోర్డులు ఐసీసీని రెండుసార్లు కలిసినప్పటికీ.. ఫార్మాట్ మార్పులపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రపంచకప్ ఫార్మాట్‌లో చేసిన మార్పులకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని, ఈ నిర్ణయం తీసుకున్న ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని తాము ఐసీసీని కోరినట్లు స్కాట్లాండ్, నెదర్లాండ్స్ బోర్డులు తెలిపాయి. అయితే తమ విజ్ఞప్తి చేసిన రెండు వారాలు గడిచినా ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నాయి.
వివరాలు
సమయం ఇచ్చిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి
ఐసీసీ వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా నిరాశపరిచిందని, ఇది తమను అవమానించడమేనని సంయుక్త ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశాయి.
కొత్త ప్రపంచకప్ ఫార్మాట్ అసోసియేట్ దేశాలకు తీవ్ర ఎదురుదెబ్బగా మారుతుందని రెండు బోర్డులు అభిప్రాయపడ్డాయి.
ఈ మార్పుల కారణంగా ఆయా దేశాల్లో క్రికెట్ అభివృద్ధి, పురోగతి కుంటుపడే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.
అసోసియేట్ సభ్యులపై నేరుగా ప్రభావం చూపించే నిర్ణయాలను తీసుకునే ముందు వారితో సంప్రదింపులు జరపాలని, తగినంత సమయం ఇచ్చిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు అమలు చేయాలని ఐసీసీని కోరాయి.
'ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల కోసం బోర్డులు, ఆటగాళ్లు చాలా ఏళ్ల ముందుగానే సన్నద్ధమవుతారు.
తక్కువ వ్యవధిలో ఫార్మాట్‌లో మార్పులు చేయడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు దెబ్బతింటాయి.
వివరాలు
వన్డే ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్‌ను రిలీజ్ చేసిన ఐసీసీ
ఇప్పటికే పరిమిత వనరులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్న బోర్డులపై నిర్వహణపరమైన, ఆర్థికపరమైన ఒత్తిడి మరింత పెరుగుతుందని స్కాట్లాండ్, నెదర్లాండ్స్ బోర్డులు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే.. ఐసీసీ ఇటీవల వన్డే ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్‌ను ప్రకటించింది. ఇందులో పాల్గొనే జట్ల సంఖ్యను 10 నుంచి 14కు పెంచింది.
మొత్తం 14 జట్లలో 10 జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా టోర్నీలో చోటు సంపాదిస్తాయి.
క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించిన జట్లలో 11వ స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆడుతుంది.
12, 13, 14వ స్థానాల్లో నిలిచిన మూడు జట్లు 'సూపర్ సిరీస్' రౌండ్‌లో పోటీపడతాయి.
వివరాలు
ఏడు జట్లు మాత్రమే సూపర్ 7కి అర్హత సాధిస్తాయి
ఈ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మాత్రమే గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది. గ్రూప్ దశలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
ఒక్కో గ్రూప్ నుంచి మూడు జట్లు, అలాగే రెండు గ్రూపుల్లోనూ నాలుగో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు కలిపి మొత్తం ఏడు జట్లు 'సూపర్-7' దశకు చేరుకుంటాయి.
ఈ దశలో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. కాగా స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రెండు జట్లూ 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించాయి.
అయినప్పటికీ, కొత్త ఫార్మాట్ తమతో పాటు ఇతర అసోసియేట్ దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ రెండు బోర్డులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.