 
                                                                                Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ₹41,921 కోట్ల నిధులను మళ్లించారు.. అనిల్ అంబానీ గ్రూపుపై కోబ్రాపోస్ట్ ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి తమ అనుబంధ సంస్థల ద్వారా రూ.41,921 కోట్ల మొత్తాన్ని తప్పుడు మార్గాల్లో మళ్లించి భారీ స్థాయి ఆర్థిక మోసానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ తన తాజా దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. అయితే,ఈ ఆరోపణలను రిలయన్స్ గ్రూప్ ఘాటుగా ఖండించింది.తమ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పడగొట్టే ఉద్దేశ్యంతో వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది అని సంస్థ పేర్కొంది. కోబ్రాపోస్ట్ నివేదిక ప్రకారం.. బ్యాంకు రుణాలు,ఐపీఓలు, బాండ్ల ద్వారా సమీకరించిన రూ.28,874 కోట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కార్పొరేట్ అడ్వయిజరీ సర్వీసెస్ సంస్థల నుంచి ప్రమోటర్లకు అనుబంధ సంస్థలకు తరలించబడినట్లు పేర్కొంది.
వివరాలు .
750 మిలియన్ డాలర్లు బదిలీ
అదనంగా, 1.535 బిలియన్ డాలర్లు (రూ.13,047 కోట్లు) సింగపూర్, మారిషస్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని అనుబంధ, షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా మోసపూరిత పద్ధతుల్లో భారత్‌లోకి మళ్లించారని కూడా కోబ్రాపోస్ట్ వెల్లడించింది. నివేదికలో మరో ముఖ్యమైన అంశంగా.. రహస్య మార్గాల్లో నెక్స్జెన్ కేపిటల్ నుంచి సింగపూర్‌కు చెందిన ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ట్రేడింగ్ పీటీఈ కంపెనీకి 750 మిలియన్ డాలర్లు బదిలీ అయ్యాయని, ఆ తర్వాత ఆ నిధులు రిలయన్స్ గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన రిలయన్స్ ఇన్నోవెంచర్స్‌కు చేరినట్లు వివరించింది.
వివరాలు
వ్యక్తిగత అవసరాలు,విలాసాల కోసం కూడా కార్పొరేట్ నిధుల వినియోగం
కోబ్రాపోస్ట్ దర్యాప్తు ప్రకారం, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్‌ఏ, సెబీ చట్టం, ఆదాయపు పన్ను చట్టం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించింది. అంతేకాకుండా, వ్యక్తిగత అవసరాలు,విలాసాల కోసం కూడా కార్పొరేట్ నిధులను వినియోగించినట్లు ఆరోపించింది. 2008లో ఒక నమోదిత కంపెనీ ద్వారా అనిల్ అంబానీ 20 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన ఓడను కొనుగోలు చేసిన వివరాన్ని కూడా నివేదికలో చేర్చింది. ఇక ఈ ఆరోపణలపై రిలయన్స్ గ్రూప్ స్పష్టంగా స్పందిస్తూ .. "మా సంస్థ ఆస్తులను తక్కువ ధరలకు చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి వ్యాపార సంస్థలకు మద్దతుగా ఈ నివేదిక రూపొందించబడినట్లు కనిపిస్తోంది" అని పేర్కొంది.