Restaurants hike menu prices: హోటల్ టిఫిన్ల ధరలకు రెక్కలు.. 5-10 శాతం పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
సామాన్యుడిపై ధరల భారం మరోసారి పడనుంది. ఉదయం లేవగానే హోటల్‌కు వెళ్లి వేడివేడి కాఫీ తాగాలన్నా, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తినాలన్నా ఇకపై జేబుకు చిల్లు పడనుంది. నిత్యావసర సరుకులు, పాల ఉత్పత్తులు, వంటగ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో హోటల్ యాజమాన్యాలు మెనూ ధరలను 5 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నాయి.
వివరాలు
నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుదల
గత ఆరు నుంచి ఎనిమిది నెలల్లో హోటళ్లలో ఉపయోగించే ముడిసరుకుల ధరలు దాదాపు 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
పాలు, పనీర్, చీజ్, నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు బియ్యం, పప్పులు, వంటనూనె, కూరగాయల ధరలు కూడా పెరగడంతో హోటల్ యజమానులపై అదనపు భారం పడుతోంది.
వీటికి తోడు రోజువారీ వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడం నిర్వహణ ఖర్చులను మరింత పెంచింది.
దీంతో పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
నెయ్యి, పాల ధరలతో అదనపు భారం!
సౌత్ ఇండియన్ టిఫిన్ల తయారీలో కీలకంగా ఉపయోగించే నెయ్యి, వెన్న ధరలు గత రెండున్నర నెలల్లోనే కిలోకు రూ.150 వరకు పెరిగాయి.
అమూల్, మదర్ డెయిరీతో పాటు ఇతర ప్రముఖ పాల సంస్థలు కూడా లీటర్ పాల ధరలను పెంచాయి.
దీంతో పాలు, పెరుగు, పనీర్, స్వీట్లు, టీ, కాఫీల తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి.
గతంలో రూ.100 ఖర్చయ్యే భోజనం లేదా టిఫిన్ తయారీ వ్యయం ఇప్పుడు రూ.105 నుంచి రూ.110 వరకు చేరినట్లు హోటల్ అసోసియేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
తప్పని పరిస్థితుల్లో మెనూ ధరల పెంపు
హోటల్ వ్యాపారంలో ముడిసరుకుల ఖర్చు మొత్తం నిర్వహణ వ్యయంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది.
అయితే, ప్రతి వస్తువు ధర పెరిగినప్పుడల్లా హోటల్ యాజమాన్యాలు వెంటనే మెనూ ధరలను మార్చడం సాధ్యం కాదు.
మెనూ కార్డులు, ధరల బోర్డులను సవరించేందుకు సమయం, ఖర్చు అవసరమవుతాయి.
కానీ ప్రస్తుతం పెరిగిన వ్యయాలను భరించడం చిన్న, మధ్యతరహా హోటళ్లకు కష్టంగా మారింది.
దీంతో కొన్ని హోటళ్లు ధరలను పెంచుతుండగా.. మరికొన్ని టిఫిన్ల పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి.
అధిక ఖర్చుతో తయారయ్యే కొన్ని వంటకాలను తాత్కాలికంగా మెనూ నుంచి తొలగిస్తున్నాయి.
వివరాలు
సామాన్యుడి జేబుకు మరింత భారం!
ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇంటి బడ్జెట్‌ను నిర్వహించడం కష్టంగా మారింది.
ఈ పరిస్థితుల్లో బయట తినే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడం సామాన్యులకు భారంగా మారుతోంది.
పండుగల సీజన్ ముగిసి సాధారణ రోజులు ప్రారంభమైన నేపథ్యంలో హోటళ్లకు వెళ్లి తినేందుకు ప్రజలు ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని హోటళ్లు ఆహార నాణ్యత తగ్గించకుండా పెరిగిన ఖర్చుల్లో కొంత భారాన్ని తామే భరిస్తున్నాయి.
అయితే, ముడిసరుకుల ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న రోజుల్లో హోటళ్లలో టిఫిన్లు, టీ, కాఫీతో పాటు భోజనం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.