DA Hike: కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. 63 శాతానికి పెరగనున్న డీఏ!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో మరో గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)పై కేంద్రం సెప్టెంబరు 2026లో కీలక ప్రకటన చేసే అవకాశముంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి,జులైలో డీఏను సవరిస్తారు. 2026 జనవరిలో డీఏను 2 శాతం పెంచడంతో మొత్తం రేటు 60 శాతానికి చేరింది. అయితే జులై విడత డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. డియర్‌నెస్ అలవెన్స్ సాధారణంగా సెప్టెంబరులో ప్రకటిస్తారని, కొన్ని సందర్భాల్లో అక్టోబరు వరకు ఆలస్యం కావచ్చని తెలిపారు.
వివరాలు
12 నెలల సూచీ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని డీఏ పెంపు నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కార్మిక శాఖకు చెందిన లేబర్ బ్యూరో విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) ఆధారంగా లెక్కిస్తారు.
గత 12 నెలల సూచీ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని డీఏ పెంపును నిర్ణయిస్తారు.
సాధారణ లెక్కింపు విధానాన్ని అనుసరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మరో 3 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
అదే జరిగితే ప్రస్తుత 60 శాతం నుంచి డీఏ 63 శాతానికి చేరుతుంది. దీంతో ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కొంత మేర పెరుగుదల కనిపించనుంది.
వివరాలు
రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం
ఇదిలా ఉండగా 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission) రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటనలు కొనసాగిస్తోంది.
ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న వేతన సంఘం.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతోంది.
సెప్టెంబరు 1న ఈ పర్యటన ముగియనుంది. సెప్టెంబరు 8న పుదుచ్చేరి,సెప్టెంబరు 16, 18 తేదీల్లో చండీగఢ్, అక్టోబరు 7, 8 తేదీల్లో బెంగళూరులో వేతన సంఘం పర్యటించనుంది.
ఇప్పటికే ఢిల్లీ, లడఖ్, జమ్మూ కశ్మీర్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ వర్గాలతో 8వ వేతన సంఘం సంప్రదింపులు జరిపింది.
2026 ఏప్రిల్ 26న ఉత్తరాఖండ్‌కు చెందిన ఉద్యోగ సంఘాలతో తొలిసారి సమావేశమైంది.
వివరాలు
2026 జనవరి 1కు ముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పెన్షన్ సవరణ
మరోవైపు 2026 జనవరి 1కు ముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా పెన్షన్ సవరణ వర్తింపజేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులు కీలక దశకు చేరుకున్నాయి.
8వ కేంద్ర వేతన సంఘం నిబంధనల్లో (ToR) మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తులను సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ఆర్థిక వ్యయ విభాగానికి (DoE) పంపింది.
ఆగస్టు 18, 2026న పంపిన మెమోలో ఆల్ ఇండియా RMS, MMS & పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి వచ్చిన విజ్ఞప్తులను తగిన చర్యల కోసం పంపినట్లు పేర్కొంది.
వివరాలు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగులు దృష్టి
పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ అంశాన్ని 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలన్న ఈ డిమాండ్‌కు ప్రాధాన్యం ఉందని పెన్షన్ నిపుణులు చెబుతున్నారు.
గతంలో వేతన సంఘాల పరిధిలో ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులను చేర్చిన సందర్భాలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక 8వ వేతన సంఘం నేపథ్యంలో ఉద్యోగులు ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై దృష్టి పెట్టారు.
7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించడంతో కనీస ప్రాథమిక వేతనం రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది.
అయితే ఆ సమయంలో డీఏ 125 శాతానికి చేరుకోవడంతో పాత కనీస వేతనంపై రూ.8,750 డీఏగా లభించింది.
వివరాలు
ప్రాథమిక వేతనం రూ.18,000 నుంచి దాదాపు రూ.38,000కు పెరిగే అవకాశం
దీంతో డీఏను కలిపిన వేతనంతో పోలిస్తే అదనంగా లభించిన ప్రయోజనం సుమారు రూ.2,250 మాత్రమేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 7వ వేతన సంఘం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
కనీసం 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకున్నా కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 నుంచి దాదాపు రూ.38,000కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
తక్కువ ఫిట్‌మెంట్‌తోనే 53% వరకు అదనపు ప్రయోజనం!
ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ.18,000పై 58 శాతం డీఏ అంటే సుమారు రూ.10,400 అవుతుంది.
ఈ లెక్కన 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో కొత్త ప్రాథమిక వేతనం అమలైతే అదనపు ప్రయోజనం సుమారు రూ.9,560 వరకు ఉండొచ్చని ఉద్యోగ సంఘాల అంచనా.
7వ వేతన సంఘంలో అదనపు ప్రయోజనం సుమారు 32 శాతంగా ఉండగా, ఈ అంచనా ప్రకారం 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నప్పటికీ అదనపు ప్రయోజనం దాదాపు 53 శాతానికి చేరవచ్చని చెబుతున్నారు.