Loading...
Rising Sea Levels: సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక
సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక

Rising Sea Levels: సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా,ముంబై నగరాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) హెచ్చరించింది. ఈ పరిస్థితి దక్షిణాసియాపైనా తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా ఈ ప్రాంతంలో 1.4 కోట్ల మందికిపైగా ప్రజలు శాశ్వతంగా తమ నివాసాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐరాస నివేదిక వెల్లడించింది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో హిమనదాలు, మంచు పలకలు వేగంగా కరిగిపోతున్నాయి. అదే సమయంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు గతంలో కంటే వేగంగా పైకి వస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం ఒక్క ఏడాదిలోనే సుమారు 6 మిల్లీమీటర్లు పెరిగినట్లు నివేదిక తెలిపింది.

వివరాలు 

వార్షిక పెరుగుదలల్లో ఇదే అత్యధికం 

ఇప్పటివరకు నమోదైన వార్షిక పెరుగుదలల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.

కోల్‌కతా, ముంబైతో పాటు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వంటి నగరాల్లోనూ ఈ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఐరాస హెచ్చరించింది.

సముద్ర జలాలు శాశ్వతంగా నగరాలను, నివాస ప్రాంతాలను చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడితే పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని తెలిపింది.

ఈ ముప్పు కేవలం తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదని ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ నవీద్‌ హనీఫ్‌ తెలిపారు.

సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ప్రజల ఆరోగ్యం,ఆహార భద్రత, మానవ హక్కులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా సంస్కృతి, పూర్వీకుల భూములు, ప్రజల గుర్తింపుపైనా దీని ప్రభావం ఉంటుందని వివరించారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల మందికి ముప్పు

ప్రభుత్వాలు తమ భవిష్యత్‌ అభివృద్ధి, ప్రణాళికల్లో సముద్ర మట్టం పెరుగుదల ముప్పును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టానికి ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో నివసిస్తున్న సుమారు 77 కోట్ల మంది ప్రజలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారని ఐరాస నివేదిక పేర్కొంది.

సముద్ర మట్టాలు పెరగడం వల్ల కనీసం 1.8 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మౌలిక వసతులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

హిమనదాల కరుగుదలతో భారీ వరదలకు అవకాశం

హిమాలయాల్లోని హిమనదాలు క్రమంగా కరిగిపోతుండటంపైనా ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రానున్న 15 నుంచి 20 ఏళ్లలో దక్షిణాసియాలో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని నవీద్‌ హనీఫ్‌ హెచ్చరించారు.

ఆ తర్వాతి దశలో కరవు పరిస్థితులు ఏర్పడటంతో పాటు పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

దీంతో ప్రాంతీయంగా ఆహార భద్రత కూడా తీవ్ర సవాలుగా మారొచ్చని హెచ్చరించారు.

ADVERTISEMENT