Loading...
Djokovic: జకోవిచ్‌కు భారీ షాక్‌.. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం!
జకోవిచ్‌కు భారీ షాక్‌.. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం!

Djokovic: జకోవిచ్‌కు భారీ షాక్‌.. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. యూఎస్ ఓపెన్‌లో అతడి పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. అర్జెంటీనాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు మరియానో నవోన్ సంచలన విజయం సాధించి జకోవిచ్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేశాడు. 2006 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే జకోవిచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. యూఎస్ ఓపెన్‌లో 24 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, నాలుగో సీడ్ జకోవిచ్.. మరియానో నవోన్ చేతిలో 6-7 (5-7), 7-5, 6-4, 2-6, 1-6తో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో జకోవిచ్ రికార్డు 19-0గా ఉంది.

వివరాలు

నాలుగున్నర గంటల పోరాటం

2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత అతడు ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ తొలి రౌండ్‌లో ఓడిపోలేదు. జకోవిచ్-నవోన్ మధ్య మ్యాచ్ దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగింది.

ఈ పోరులో జకోవిచ్ 10 డబుల్ ఫాల్ట్‌లు, 70 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు నవోన్ అద్భుతంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ జకోవిచ్ సర్వీసును ఏకంగా ఆరుసార్లు బ్రేక్ చేశాడు.

తొలి సెట్‌ను జకోవిచ్ కోల్పోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో ముందంజ వేసేలా కనిపించాడు.

అయితే ఆ సమయంలో జకోవిచ్ అస్వస్థతకు గురయ్యాడు.

మ్యాచ్ మధ్యలో అతడికి వాంతులు రావడంతో చికిత్స కూడా అవసరమైంది. ఆ తర్వాత అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

వివరాలు

మెద్వెదెవ్‌కు శుభారంభం

ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న నవోన్ చివరి రెండు సెట్లలో అలవోకగా పైచేయి సాధించి సంచలన విజయాన్ని అందుకున్నాడు.

మరోవైపు ఏడో సీడ్ రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గాస్టన్‌పై 6-4, 6-2, 6-4తో విజయం సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన మునార్.. ఫ్రాన్స్ ఆటగాడు అట్మేన్‌ను 6-7 (5-7), 3-6, 6-1, 7-6 (7-4), 7-5తో ఓడించాడు.

కజకిస్థాన్ ఆటగాడు బబ్లిక్, అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

ADVERTISEMENT

వివరాలు

సబలెంక అలవోక విజయం

టామీ పాల్ 6-7 (3-7), 6-1, 6-3, 6-3తో హాంకాంగ్‌కు చెందిన వాంగ్‌పై విజయం సాధించగా.. బబ్లిక్ 6-4, 6-2, 3-6, 6-1తో అమెరికా ఆటగాడు వూల్ఫ్‌ను ఓడించాడు.

మరో మ్యాచ్‌లో చెకియా ఆటగాడు లెహెకా 6-1, 7-6 (7-5), 4-6, 6-2తో స్పెయిన్‌కు చెందిన బుస్టాపై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, బెలారస్ స్టార్ అరీనా సబలెంక శుభారంభం చేసింది.

తొలి రౌండ్‌లో కొలంబియాకు చెందిన ఒసోరియోను 6-2, 6-4తో ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.

ఏడో సీడ్ చెకియా క్రీడాకారిణి ముచోవా.. ఆస్ట్రియాకు చెందిన క్రాస్‌ను 6-3, 6-0తో చిత్తు చేసింది. 9వ సీడ్ ఉక్రెయిన్ స్టార్ స్వితోలినా 6-1, 6-2తో అర్జెంటీనాకు చెందిన సియెర్రాపై విజయం సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్ ఓటమి

11వ సీడ్ కోస్త్యుక్ 6-4, 6-1తో ఆస్ట్రేలియాకు చెందిన హంటర్‌ను ఓడించింది.

వైల్డ్‌కార్డ్ ద్వారా యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన మాజీ ఛాంపియన్, అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌కు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది.

అమెరికాకే చెందిన కెనిన్ చేతిలో2-6, 6-7 (6-8)తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో సెర్బియాకు చెందిన వెకిచ్ 6-2, 4-6, 6-3తో ఆస్ట్రేలియాకు చెందిన తాలియాపై గెలిచింది.

బ్రిటన్ ఆటగాళ్ల బౌల్టర్6-4, 3-6, 6-0తో అమెరికా క్రీడాకారిణి లీని ఓడించింది. చైనాకు చెందిన వాంగ్6-4, 6-2తో కొలంబియాకు చెందిన అరాంగోపై విజయం సాధించింది.

చెకియా మాజీ స్టార్ ప్లిస్కోవా 2-6, 7-5, 6-3తో జర్మనీకి చెందిన వాందెవింకెల్‌ను ఓడించి ముందుకు సాగింది.

ADVERTISEMENT