Loading...
Messi: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు.. ముగిసిన రెండు దశాబ్దాల అద్భుత ప్రయాణం!
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు.. ముగిసిన రెండు దశాబ్దాల అద్భుత ప్రయాణం!

Messi: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు.. ముగిసిన రెండు దశాబ్దాల అద్భుత ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప అధ్యాయం ముగిసింది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు గుడ్‌బై చెబుతున్నట్లు 39 ఏళ్ల మెస్సి శనివారం ప్రకటించాడు. ఈ నిర్ణయం తనను ఎంతో బాధిస్తోందని, అయితే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందని తెలిపాడు. ఈ నిర్ణయం ఎంతో బాధిస్తుంది. కానీ రిటైర్ కావాల్సిన సమయం వచ్చేసింది. అర్జెంటీనా జెర్సీ కోసం మైదానంలో ఎంతో పోరాడా. మీకు ఆనందాన్ని ఇవ్వడం, అర్జెంటీనా పౌరులుగా మీరు గర్వపడేలా చేయడమే నా లక్ష్యమని మెస్సి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

వివరాలు

207 మ్యాచ్‌లు.. 125 గోల్స్

తాను జూన్ 21నే రిటైర్మెంట్ లేఖను సిద్ధం చేసుకున్నానని మెస్సి వెల్లడించాడు. అయితే తన తండ్రి జోర్జ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ లేఖను వెంటనే పోస్ట్ చేయలేకపోయానని చెప్పాడు. మెస్సి తండ్రి జోర్జ్ ఆగస్టు 8న కన్నుమూశారు.

తన రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులందరికీ మెస్సి కృతజ్ఞతలు తెలిపాడు.

మెస్సి అర్జెంటీనా తరఫున 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 125 గోల్స్ సాధించాడు.

2006లో క్రొయేషియాపై తన తొలి అంతర్జాతీయ గోల్ నమోదు చేశాడు. 2026 ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌పై కొట్టిన గోల్‌నే తన చివరి అంతర్జాతీయ గోల్‌గా నిలిచింది.

వివరాలు

క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్న మెస్సి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెస్సి రెండో స్థానంలో ఉన్నాడు.

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 233 మ్యాచ్‌ల్లో 146 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. మెస్సి 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్‌తో తర్వాతి స్థానంలో నిలిచాడు.

అర్జెంటీనా జాతీయ జట్టుకు వీడ్కోలు పలికినప్పటికీ.. మెస్సి పూర్తిగా ఫుట్‌బాల్‌కు దూరం కావడం లేదు. అతడు క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు.

ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్ (MLS) క్లబ్ ఇంటర్ మయామికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ముగిసిన 2026 ప్రపంచకప్‌లో మెస్సి ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు గోల్స్ చేశాడు.

రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న ఆటగాడిగా నిలిచిన అతడు.. 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ADVERTISEMENT

వివరాలు

గతంలోనూ రిటైర్మెంట్ ప్రకటన

ప్రపంచకప్ టోర్నీల్లో మెస్సి మొత్తం 21 గోల్స్ సాధించాడు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2016లో కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి అనంతరం అతడు అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే ఆ నిర్ణయం ఎక్కువ కాలం కొనసాగలేదు. కొద్దికాలానికే మెస్సి తిరిగి అర్జెంటీనా జట్టులోకి వచ్చాడు.

ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పడంతో.. అర్జెంటీనా జట్టుతో మెస్సి సాగించిన సుదీర్ఘ, చిరస్మరణీయ ప్రయాణానికి ముగింపు పలికినట్లైంది.

ADVERTISEMENT