DA hike: డీఏ పెంపుపై కేంద్రం మౌనం.. దీపావళికి ముందైనా గుడ్‌న్యూస్ వస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు డీఏ (కరువు భత్యం) పెంపుపై ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. అక్టోబర్ 14, 21 తేదీల్లో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాల్లో డీఏ పెంపుపై ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు అక్టోబర్ 28న జరగనున్న తదుపరి కేబినెట్ సమావేశంపైనే ఆశలు పెట్టుకున్నారు. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెబుతుందని ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 16న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పనితీరుతో సంబంధం లేని బోనస్‌ను ప్రకటించింది. అయితే డీఏ లేదా డీఆర్ (కరువు ఉపశమనం)పెంపుపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో కొంత శాతంగా డీఏను చెల్లిస్తారు. పెన్షనర్లకు ఇదే విధంగా డీఆర్ వర్తిస్తుంది.
వివరాలు
డీఏ పెంపుపై ఉద్యోగుల ఆశలు.. గతంలో ఎప్పుడెప్పుడు ప్రకటించారంటే?
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరగడాన్ని కొంతవరకు తగ్గించేందుకు వీటిని అందిస్తారు.
దసరా పండుగకు ముందే డీఏ పెంపు ప్రకటన వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించారు.
గతంలోనూ సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు కేంద్రం డీఏ పెంపును ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఈసారి అలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశ ఎదురైంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం, అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తుంది.
సాధారణంగా జనవరి,జులై నెలల నుంచి ఈ పెంపులు అమల్లోకి వస్తాయి.
వీటికి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా మార్చి, అక్టోబర్ నెలల్లో వెలువడుతుంటాయి.
వివరాలు
డీఏ పెంపుపై అక్టోబర్ 28న కీలక ప్రకటన వచ్చేనా?
అయితే 2026లో రెండో విడత డీఏ పెంపును ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ఆర్థిక శాఖ చివరిసారిగా డీఏను పెంచింది.
అప్పట్లో ప్రాథమిక వేతనంలో 58 శాతంగా ఉన్న డీఏను 60 శాతానికి పెంచింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు జులై 2026 నుంచి అమలు కావాల్సిన తదుపరి విడత డీఏ పెంపుపై ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం,తదుపరి కేంద్ర కేబినెట్ సమావేశం అక్టోబర్ 28న జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా కేంద్ర కేబినెట్ సమావేశాలు బుధవారాల్లో జరుగుతుంటాయి. అయితే అవసరాన్ని బట్టి సమావేశాల తేదీల్లో మార్పులు చేస్తుంటారు.
వివరాలు
గతంలో అక్టోబర్‌లోనే డీఏ పెంపు ప్రకటనలు.. ఈసారి కూడా అదే ఆశలు!
ఈ నేపథ్యంలో అక్టోబర్ 28న జరిగే సమావేశంలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి. దీంతో పండుగకు ముందే డీఏ పెంపును ప్రకటించి ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం కానుక అందిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
గత ఐదేళ్లలో జులై విడత డీఏ పెంపు ప్రకటనలు వెలువడిన తేదీలను పరిశీలిస్తే.. 2025లో అక్టోబర్ 1న కేంద్రం డీఏ, డీఆర్‌ను 3 శాతం పెంచింది.
దీంతో రేటు 55 శాతం నుంచి 58 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
2024లో అక్టోబర్ 16న డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వివరాలు
గతంలో అక్టోబర్‌లోనే డీఏ పెంపు ప్రకటనలు.. ఈసారి కూడా అదే ఆశలు!
దీంతో రేటు 50శాతం నుంచి 53శాతానికి చేరింది.ఈ పెంపు కూడా జులై 1 నుంచే వర్తించింది.
2023లో అక్టోబర్ 18న కేబినెట్ 4శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది.
దీంతో డీఏ,డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెరిగాయి. 2022లో సెప్టెంబర్ 28న 4శాతం పెంపును ప్రకటించడంతో డీఏ 34శాతం నుంచి 38శాతానికి చేరింది.
ఇక 2021లో అక్టోబర్ 21న 3శాతం పెంపును ప్రకటించారు.దీంతో డీఏ 28శాతం నుంచి 31శాతానికి పెరిగింది.
ఈగత నిర్ణయాలను బట్టి చూస్తే,అక్టోబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
అయితే అక్టోబర్ 28న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారా?లేదా? అన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకు స్పష్టత రాదు.