LIC shares: ఎల్‌ఐసీ షేర్లు 50 శాతం పడిపోయాయా? అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా భారీగా క్షీణించినట్లు కనిపించాయి. షేరు ధర దాదాపు సగానికి పడిపోవడంతో బోనస్ షేర్ల విషయం తెలియని పలువురు మదుపర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇది నిజమైన పతనం కాదు. కంపెనీ ప్రకటించిన బోనస్ షేర్ల ప్రభావం షేరు ధరలో ప్రతిబింబించడమే దీనికి కారణం. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి జాతీయ స్టాక్ మార్పిడి కేంద్రంలో ఎల్‌ఐసీ షేరు ధర రూ.830 వద్ద నిలిచింది. కంపెనీ ఒకటికి ఒకటి నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడంతో షేరు ధర సాంకేతికంగా సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో షేరు రూ.417.60 వద్ద ప్రారంభమైంది.
వివరాలు
ఒకటికి ఒకటి నిష్పత్తిలో బోనస్ షేర్లు
అనంతరం స్వల్ప ఒత్తిడికి లోనై ఒక శాతం లోపే నష్టంతో రూ.410.80 వద్ద ట్రేడవుతోంది. దీంతో షేరు 50 శాతం క్షీణించినట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ధరలో అంతటి పతనం చోటుచేసుకోలేదు. మే 29 నాటికి ఎల్‌ఐసీ షేర్లను కలిగి ఉన్న వాటాదారులకు ఒకటికి ఒకటి నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అంటే రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు అదనంగా మరో రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరును ఉచితంగా కేటాయించనుంది. ఈ బోనస్ షేర్ల జారీ కోసం 2025 డిసెంబరు 31 నాటికి సంస్థ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల నిల్వలు, మిగులు నిధులను వినియోగించనున్నట్లు ఎల్‌ఐసీ గతంలో స్టాక్ మార్పిడి కేంద్రాలకు వెల్లడించింది.
వివరాలు
షేర్ల సంఖ్య పెరగడంతో ఒక్కో షేరు ధర అనుగుణంగా సర్దుబాటు అవుతుంది
ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో కంపెనీ మొత్తం షేర్ల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో చిన్న మదుపర్లకు షేర్లు మరింత అందుబాటులోకి రావడంతో వారి ఆసక్తిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే బోనస్ షేర్లు జారీ చేయడం వల్ల కంపెనీ మొత్తం మార్కెట్ విలువలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం షేర్ల సంఖ్య పెరగడంతో ఒక్కో షేరు ధర అనుగుణంగా సర్దుబాటు అవుతుంది అంతే.