EPFO New Rule: 20 రోజుల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ పరిష్కారం.. ఆలస్యమైతే 12% పెనాల్టీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఉపసంహరణ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ నిర్ణయం, బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ అమలులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానంలో ఉద్యోగుల భవిష్యనిధి పథకం-2026, ఉద్యోగుల పింఛను పథకం-2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-2026లను తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త పథకాలలో పలు కీలక నిబంధనలను చేర్చింది.
వివరాలు
వడ్డీ మొత్తాన్ని సంబంధిత అధికారి జీతం నుంచి మినహాయించి..
పీఎఫ్ విత్‌డ్రా, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ నిర్ణయం, బీమా క్లెయిమ్‌లను వేగంగా పూర్తి చేయడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అర్హత కలిగిన క్లెయిమ్‌లను సరైన కారణం లేకుండా 20 రోజుల్లోగా పరిష్కరించకపోతే సంబంధిత ఈపీఎఫ్‌ఓ కమిషనర్‌పై 12 శాతం పెనాల్టీ విధించాలని నిర్ణయించింది. క్లెయిమ్ ఆలస్యమైన కారణంగా చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని సంబంధిత అధికారి జీతం నుంచి మినహాయించి,క్లెయిమ్ చేసిన సభ్యుడికి పరిహారంగా చెల్లిస్తారు. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చెల్లింపుల ఆలస్యానికి పరిహారం చెల్లించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలలో కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
వివరాలు
ఈపీఎఫ్‌ఓ సేవలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా కొత్త నిబంధనలు
అయితే గతంలో అమలులో ఉన్న వడ్డీ నిబంధనకు బదులుగా ఇప్పుడు 12 శాతం వడ్డీని నిర్దేశించినట్లు వెల్లడించారు. సామాజిక భద్రత కోడ్‌కు అనుగుణంగా కొత్త పథకాలను నోటిఫై చేయడం తప్ప, ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్ పథకాల చెల్లింపుల విధానంలో ఇతర మార్పులు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈపీఎఫ్‌ఓ సేవలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఉద్యోగ సంస్థలు, ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలు, ఈపీఎఫ్‌ఓ నుంచి మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్‌లు సభ్యులు క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్ సదుపాయాలు కల్పించాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, ఈపీఎఫ్ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లకు మించి పాక్షిక ఉపసంహరణలు చేయకుండా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.