ICRISAT: ఇక్రిశాట్ నుంచి రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు రకాలను ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కర్ణాటకలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఐదేళ్లపాటు విస్తృత పరిశోధనలు నిర్వహించి అభివృద్ధి చేశారు. ఈ కొత్త వేరుసెనగ రకాలకు ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) పరిధిలోని అఖిల భారత వేరుసెనగ సమన్వయ పరిశోధన ప్రాజెక్టు కమిటీ ఆమోదం తెలిపింది.
వివరాలు
హైఓలిక్ వేరుసెనగల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఓలిక్ ఆమ్లం
దేశంలో వంటనూనెల ఉత్పత్తిని పెంచి, నూనెల రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ రకాలు కీలకంగా ఉపయోగపడతాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, ప్రపంచ పరిశోధన కార్యక్రమ సంచాలకుడు రామన్‌బాబు వెల్లడించారు. హైఓలిక్ వేరుసెనగల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఓలిక్ ఆమ్లం (Oleic Acid) అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ రకాలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటి నుంచి లభించే నూనె ఆక్సీకరణ స్థిరత్వం, పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ఆహార పరిశ్రమలు కూడా ఈ రకాలపై ఆసక్తి చూపుతున్నాయి.
వివరాలు
ఐసీజీవీ181030 ప్రత్యేకతలు
ఐసీజీవీ181030 భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి హైఓలిక్ వేరుసెనగ రకం. దీనిని ఇక్రిశాట్, కర్ణాటకలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ రకం వానాకాల సాగుకు అనుకూలంగా ఉండి ఒడిశాతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేయవచ్చు. ఇందులో 78 శాతం ఓలిక్ ఆమ్లం ఉండగా, సంప్రదాయ వేరుసెనగ రకాలతో పోలిస్తే 7 నుంచి 12 శాతం వరకు అధిక దిగుబడి ఇస్తుంది.
వివరాలు
ఐసీజీవీ201214 ప్రత్యేకతలు
ఐసీజీవీ201214 రకాన్ని ఇక్రిశాట్, గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ రకం ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగుకు అనువుగా ఉంటుంది. ఇందులో 81 శాతం ఓలిక్ ఆమ్లం, 53 శాతం నూనె శాతం, 27 శాతం ప్రోటీన్ ఉంటుంది. సంప్రదాయ వేరుసెనగ రకాలతో పోలిస్తే 19 శాతం వరకు అధిక దిగుబడి అందించే సామర్థ్యం ఈ రకానికి ఉంది.