EPFO: పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. పెన్షన్ అర్హతలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) అర్హత నిబంధనలపై స్పష్టత ఇచ్చింది. తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల నెలవారీ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉద్యోగి నెలవారీ వేతనం, గతంలో పెన్షన్ పథకంలో సభ్యుడిగా ఉన్నారా లేదా అనే అంశాల ఆధారంగా EPS అర్హత నిర్ణయిస్తారని తెలిపింది. పెన్షన్ పథకంలో చేరాలా? జీతం నుంచి పెన్షన్ వాటా జమ అవుతుందా? అనే సందేహాలున్న ఉద్యోగులకు ఈ స్పష్టత ఉపయోగపడనుంది. EPFO తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
EPFO పరిధిలోకి వచ్చే వారు ఎవరు..
సెప్టెంబర్ 17, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్న కొత్త వేతన పరిమితితో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య సంపాదించే 51 లక్షల మందికి పైగా అదనపు సంఘటిత రంగ ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత ప్రకటనలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈపీఎఫ్ఓ చేసిన ట్వీట్
📢 Dear Employees,
— EPFO (@officialepfo) October 11, 2026
Be sure to know your EPS pension eligibility!
If your monthly salary is ₹25,000 or less, EPS membership is mandatory as per eligibility. If your monthly salary is more than ₹25,000, EPS membership is not mandatory. #EPFO #EPFOWithYou #HumHainNa #EPS pic.twitter.com/4dbOVL0NTS
వివరాలు
EPS సభ్యత్వానికి ఎవరు అర్హులు?
EPFO వెల్లడించిన వివరాల ప్రకారం.. నెలకు రూ.25 వేలు లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులు పథకానికి సంబంధించిన నిబంధనలకు లోబడి EPS సభ్యత్వానికి అర్హులు కావచ్చు.
కొత్త వేతన పరిమితి పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం పెన్షన్ పథకానికి సంబంధించిన చందాలు జమ చేయాలి.
అయితే, నెలకు రూ.25వేలకు మించి వేతనం పొందుతూ గతంలో EPS సభ్యులుగా లేని ఉద్యోగులు కొత్తగా ఈ పథకంలో చేరేందుకు అర్హులు కాదని EPFO వెల్లడించిన గ్రాఫిక్‌లో పేర్కొన్నారు.
అంటే..వేతన పరిమితి పెరిగినంత మాత్రాన ప్రతి ఉద్యోగికీ పెన్షన్ ప్రయోజనాలు వర్తిస్తాయని భావించకూడదు.
గతంలో పెన్షన్ పథకంలో సభ్యుడిగా ఉన్నారా? ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హత ఉందా? అనే అంశాలను పరిశీలించాలి.
వివరాలు
EPFO వేతన పరిమితి పెంపుతో ప్రయోజనాలేంటి?
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగుల నెలవారీ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
ఈ మార్పు సెప్టెంబర్ 17,2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వివరాలు పేర్కొంటున్నాయి.
దీంతో నెలకు రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య వేతనం పొందే 51లక్షల మందికి పైగా అదనపు సంఘటిత రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందే అవకాశం ఉంది.
అర్హులైన ఉద్యోగులకు మూడు పథకాల ద్వారా ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF),ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS),ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI). EPF ద్వారా ఉద్యోగులు, యజమానులు చేసే చందాలతో ఉద్యోగుల పదవీ విరమణ కోసం పొదుపు సమకూరుతుంది.
వివరాలు
EPFO వేతన పరిమితి పెంపుతో ప్రయోజనాలేంటి?
EPS ద్వారా అర్హులైన సభ్యులకు పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. EDLI పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలు అందుతాయి.
గతంలో వేతనం ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి రాని మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ పరిమితి పెంపు ప్రధాన ఉద్దేశం.
వివరాలు
పెన్షన్ చందాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
పెన్షన్‌కు పరిగణించే వేతన పరిమితి పెరగడంతో EPSకు యజమాని చెల్లించే గరిష్ఠ నెలవారీ చందా కూడా పెరగనుంది.
ప్రస్తుతం వర్తించే 8.33శాతం లెక్క ప్రకారం..పెన్షన్‌కు పరిగణించే వేతన పరిమితి రూ.15 వేలుగా ఉన్నప్పుడు నెలకు గరిష్ఠంగా రూ.1,250చందా జమ అవుతుంది.
ఈ పరిమితి రూ.25వేలకు పెరిగితే గరిష్ఠ చందా సుమారు రూ.2,083కు చేరుతుంది.
అయితే, నెలకు రూ.25వేల వరకు వేతనం పొందే ప్రతి ఉద్యోగికీ రూ.2,083చందా తప్పనిసరిగా జమ అవుతుందని అనుకోవద్దు.
ఉద్యోగి అర్హత,పెన్షన్‌కు పరిగణించే వేతనం, పథకం నిబంధనల ఆధారంగా వాస్తవ చందా మొత్తం మారుతుంది.
అలాగే,EPSకు యజమాని చెల్లించే మొత్తం అతను చెల్లించాల్సిన మొత్తం పీఎఫ్ చందాలో భాగమే. ఉద్యోగి జీతం నుంచి అదనంగా ఈ మొత్తాన్ని కోత విధించరు.
వివరాలు
పెన్షన్ చందా జమ కాకపోతే ఏం చేయాలి?
తనకు వర్తించే చందా జమ కావడం లేదని ఉద్యోగి భావిస్తే ముందుగా యజమానిని సంప్రదించాలని EPFO సూచించింది.
అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే EPFO ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వేదిక అయిన EPFiGMS ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు చేసేటప్పుడు జీతం వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇవి సమస్యను వివరించడానికి, తమ వాదనకు ఆధారాలు చూపించడానికి ఉపయోగపడతాయి.
కాబట్టి, పెన్షన్ ప్రయోజనాలు వర్తిస్తాయని భావించే ముందు ఉద్యోగులు తమ అర్హత, గత సభ్యత్వ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.