Tiger Enclosure: వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించడంతో ఆ క్రూరమృగం అతడిపై దాడి చేసింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి వైల్డ్‌లైఫ్ పార్క్ సిబ్బంది కళ్లుగప్పి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. దీంతో అక్కడ ఉన్న పులి ఒక్కసారిగా అతడిపై దూకి దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పార్క్ సిబ్బంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.
వివరాలు
పులిపై కాల్పులు జరపలేదు.. పార్క్ యాజమాన్యం స్పష్టీకరణ
ఈ ఘటన నేపథ్యంలో పులిపై కాల్పులు జరిపినట్లు వస్తున్న వార్తలను వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం ఖండించింది.
పులిని కాల్చలేదని, అది ఇప్పటికీ తన ఎన్‌క్లోజర్‌లోనే ఉందని స్పష్టం చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.
ఘటన నేపథ్యంలో ఆదివారం వైల్డ్‌లైఫ్ పార్క్‌ను మూసివేశారు. మరోవైపు, ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిపై పులి దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.