Economic Survey: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే ఈ సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ నేతృత్వంలో రూపొందించారు. సర్వే అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి మధ్య, భారత్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోందని సర్వే సూచిస్తుంది.
వివరాలు
2030 నాటికి దేశంలో సుమారు 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు
రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ,4% టార్గెట్కు చేరనున్నట్లు సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఆహార ధరల నియంత్రణ సామాన్య ప్రజలకు ఊరట కలిగించే అంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన రుతుపవనాల కారణంగా వ్యవసాయ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని,రబీ పంట దిగుబడి పెరుగుదల వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించబడింది. 2030 నాటికి దేశంలో సుమారు 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని, దీని కోసం తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్వే సూచించింది. అలాగే, 2047 నాటికి "వికసిత్ భారత్" (Vikasit Bharat) లక్ష్యాన్ని సాధించాలంటే, వచ్చే రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి రేటును నిలకడగా కొనసాగించడం అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
గత ఐదేళ్లలో గణనీయమైన అభివృద్ధి
కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలని సర్వేలో నొక్కి చెప్పింది. గత ఐదేళ్లలో నేషనల్ హైవేలు, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో తెలిపారు.