
Swiggy Q4 results: క్విక్ కామర్స్‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.1,018.18 కోట్లకు చేరింది.
గతేడాది ఇదే కాలంలో ఈ నష్టం రూ.554.77 కోట్లు కాగా, ఈసారి అది రెండింతలయ్యింది. ఇందుకు ప్రధానంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టినదే కారణంగా చెబుతున్నారు.
ఇక స్విగ్గీ ఆదాయం రూ.3,045.5 కోట్ల నుంచి రూ.4,410 కోట్లకు పెరిగింది.
అదే సమయంలో ఖర్చులు రూ.3,668 కోట్ల నుంచి రూ.5,609.6 కోట్లకు పెరగడంతో నష్టాలు కాస్త బరువయ్యాయి.
Details
దేశవ్యాప్తంగా 316 కొత్త డార్క్ స్టోర్లు
ఫుడ్ డెలివరీ విభాగంలో గ్రాస్ ఆర్డర్ విలువ 17.6 శాతం పెరిగి రూ.7,347 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది.
ఇన్‌స్టామార్ట్ పరంగా చూస్తే, సగటు ఆర్డర్ విలువ 13.3 శాతం పెరిగి రూ.526కు చేరినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా 316 కొత్త డార్క్ స్టోర్లను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.
స్విగ్గీ ఎండీ, గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటి ప్రకారం, క్విక్ కామర్స్ విభాగం వేగంగా విస్తరిస్తోందని, అదే సమయంలో పోటీ కూడా పెరుగుతోందని తెలిపారు.
మార్కెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెంచుతున్నామని వివరించారు.